
దళితులు ఆదివాసీలు గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వర్గాలు ఇందిరా గాంధీని సొంత తల్లిలా ప్రేమించేవారని ఆమెను ఇప్పటికీ మరిచిపోలేదని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం అమలుపై సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. 25 లక్షల ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరా గాంధీదేనని అన్నారు.
ఆమె స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 31 శాతం మంది లబ్ధిదారులు దళితులేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎస్టీలకు 17 శాతం ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 3.48 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని సీఎం తెలిపారు.
ఈ పథకం ద్వారా దళిత గిరిజన వర్గాలకు నాణ్యమైన భోజనం అందించగలుగుతున్నామని పేర్కొన్నారు. ఈ వర్గాలను దృష్టిలో ఉంచుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. బాధితులకు అందాల్సిన నష్టపరిహారాన్ని బడ్జెట్తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
చదువే జీవితాలను మార్చగలదని సీఎం పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల పిల్లలను విద్య వైపు నడిపించకపోతే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదన్నారు. పిల్లలను చదువు క్రీడల వైపు ప్రోత్సహించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా దళితులు ఆదివాసీలు గిరిజనుల అభివృద్ధికి కలిసి పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ‘ఈ ప్రభుత్వం మీది మీ కోసం పనిచేస్తుంది’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
