
తెలంగాణలో కొత్త పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అక్టోబర్‌లో కొత్త పెన్షన్లను ప్రారంభించేలా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొత్త పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఒంటరి మహిళలు వితంతువులకు అర్హత మేరకు పెన్షన్లు అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీతక్క సూచించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పెన్షన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దసరా నాటికి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు.
