
D NEWS: జూరాల ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని పంటలను కాపాడేందుకు ప్రభుత్వం సాగునీటిని విడుదల చేసింది. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో జూరాల కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు.
అధికారుల సమాచారం ప్రకారం కుడి కాలువకు సుమారు 350 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా జూరాల ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళనలు చేస్తున్నారు. పంటలు కీలక దశలో ఉన్న సమయంలో నీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కాలువలకు నీటిని విడుదల చేసింది.
ఇక జూరాల నీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం కర్ణాటక నుంచి అదనపు కృష్ణా జలాలను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పరిధిలోని పంటలను కాపాడేందుకు రోజుకు 5,000 క్యూసెక్కుల చొప్పున 30 రోజుల పాటు నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రతినిధులు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
సాగునీటి విడుదలలో తాగునీటి అవసరాలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. జూరాల ఆయకట్టు పంటలను కాపాడేందుకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.
