
D News: కార్తీ, పి.ఎస్. మిత్రన్ కాంబినేషన్‌లో వచ్చిన **‘సర్దార్ 2’**పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో సందడి కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. తొలి భాగం విజయంతో సీక్వెల్‌పై మంచి హైప్ వచ్చినా, ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయిందనే చర్చ జరుగుతోంది.
ఆక్యుపెన్సీ దారుణంగా ఉందా?
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ‘సర్దార్ 2’కు ఆక్యుపెన్సీ తక్కువగా నమోదవుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉదయం, మధ్యాహ్నం షోలకు ప్రేక్షకుల సంఖ్య మరింత తగ్గినట్లు సమాచారం. కొన్ని మల్టీప్లెక్స్‌లలో టికెట్ బుకింగ్స్ కనీస స్థాయికి చేరకపోవడంతో షోలు రద్దు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఓపెనింగ్స్‌పై ప్రభావం
విడుదలకు ముందే ‘సర్దార్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవనే వార్తలు వచ్చాయి. కార్తీకి తెలుగులో ఉన్న క్రేజ్‌తో పాటు తొలి భాగం విజయాన్ని బేస్ చేసుకుని భారీ ఓపెనింగ్స్ వస్తాయని భావించినా.. బుకింగ్స్‌లో మాత్రం పెద్దగా ఊపు కనిపించలేదని తెలుస్తోంది.
నిడివి కూడా మైనస్‌గా మారిందా?
సినిమాకు వస్తున్న మిశ్రమ స్పందన బాక్సాఫీస్‌పై ప్రభావం చూపుతున్నట్లు టాక్. దాదాపు మూడు గంటల నిడివి, ముఖ్యంగా ద్వితీయార్థంలో నెమ్మదించే కథనం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ అవి కథతో పూర్తిగా కలిసిపోలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.
కార్తీతో పాటు ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ వంటి నటీనటులు ఉన్నప్పటికీ.. కథ, కథనం విషయంలో వచ్చిన స్పందనే సినిమాకు ప్రతికూలంగా మారిందనే చర్చ సాగుతోంది.
