కొద్దిరోజుల విరామం తర్వాత తెలంగాణలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఆదివారం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా నమోదైంది.
రాష్ట్రంలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా పిట్లం, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలో 5.1 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో 4.7 సెం.మీ., పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, ముత్తారంలలో 4.5 సెం.మీ., సంగారెడ్డి జిల్లా కల్హేర్, మెదక్ జిల్లా టేక్మల్‌లో 4.2 సెం.మీ., కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 3.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, జగిత్యాల జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
వర్షాల కారణంగా హైదరాబాద్‌లోనూ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్బీఐ రోడ్డులోని రవీంద్రభారతి సమీపంలో తెల్లవారుజామున భారీ వృక్షం నేలకూలింది. చెట్టు కింద ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపడటంతో పాటు రోడ్డుపై ఉన్న ఓ ఆటో పూర్తిగా ధ్వంసమైంది. చెట్టు కూలడాన్ని గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే వాహనం నుంచి దూకి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది ఇదిలా ఉండగా సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు కూడా వర్షాల సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.