
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు. వాహనాల రద్దీని తగ్గించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు పలు ప్రాంతాల్లో వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రధాన మార్గాల్లో ఈ విధానం కొనసాగుతుండగా.. తాజాగా లక్డీకాపూల్ ప్రాంతంలోనూ ప్రయోగాత్మకంగా వన్‌వే వ్యవస్థను ప్రవేశపెట్టాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.
నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో లక్డీకాపూల్ కూడా ఒకటి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఈ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు వాహనాల రాకపోకలకు కొత్త మార్గాలను రూపొందిస్తున్నారు.
లక్డీకాపూల్‌లో సీపీ సజ్జనార్ పర్యటన
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తాజాగా లక్డీకాపూల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు. పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, లక్డీకాపూల్ క్రాస్‌రోడ్స్, పాత కంట్రోల్ రూమ్ జంక్షన్, ద్వారకా హోటల్ ప్రాంతాలను సందర్శించారు.
ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు గల కారణాలను పరిశీలించిన ఆయన.. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వన్‌వే విధానాన్ని అమలు చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని భావిస్తున్నారు.
వాహనదారులకు కొత్త ట్రాఫిక్ రూట్లు
ప్రతిపాదిత మార్పుల్లో భాగంగా పాత కంట్రోల్ రూమ్ నుంచి రవీంద్ర భారతి, ఇక్బాల్ మినార్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి నుంచి నేరుగా అనుమతించరు. ఈ వాహనాలను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, సచివాలయం జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.
అలాగే సచివాలయం జంక్షన్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లే వాహనాలకు మరో మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ వాహనాలు ఇక్బాల్ మినార్ నుంచి రవీంద్ర భారతి వైపు వెళ్లి, పాత కంట్రోల్ రూమ్ వద్ద యూటర్న్ తీసుకోవాలి. అక్కడి నుంచి అసెంబ్లీ గేట్ నంబర్ 3, రవీంద్ర భారతి, హెచ్డీఎఫ్సీ మీదుగా పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకునేలా రూట్‌ను రూపొందిస్తున్నారు.
ఇక నిరంకారి జంక్షన్ నుంచి పాత కంట్రోల్ రూమ్‌కు వెళ్లే వాహనాలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లించనున్నారు. అక్కడి నుంచి ఇక్బాల్ మినార్ వద్ద కుడివైపు తిరిగి, రవీంద్ర భారతి మీదుగా పాత కంట్రోల్ రూమ్‌కు చేరుకునేలా ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
తొలుత ప్రయోగాత్మకంగా అమలు
లక్డీకాపూల్‌లో ప్రతిపాదించిన ట్రాఫిక్ మార్పులను ముందుగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఈ విధానం వల్ల ట్రాఫిక్ రద్దీ ఎంతవరకు తగ్గుతుంది? వాహనదారులకు ప్రయాణం సులభమవుతుందా? అనే అంశాలను పరిశీలిస్తారు. ప్రయాణికుల నుంచి వచ్చే అభిప్రాయాలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మార్పులను విజయవంతంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేబీఆర్ పార్క్ వద్ద మరో ట్రాఫిక్ మార్పు
మరోవైపు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఇప్పటికే వన్‌వే విధానం అమలులో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న వన్‌వే మార్గానికి అదనంగా మరో ట్రాఫిక్ లేన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పోలీసులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. లక్డీకాపూల్‌లో ప్రతిపాదించిన వన్‌వే విధానం అమల్లోకి వస్తే ఆ ప్రాంతంలో వాహనాల రద్దీ తగ్గే అవకాశం ఉంది.
