D Educt: Nov 7: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వార్షిక పరీక్షల మధ్య రెండు రోజుల విరామం!

ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు వార్షిక పరీక్షల మధ్య వ్యవధిని పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఒకరోజు ప్రథమ సంవత్సరం, మరోరోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రతి పరీక్షకు కనీసం ఒకరోజు విరామం లభిస్తోంది. ఈ వ్యవధిని రెండు రోజులకు పెంచాలన్నది విద్యాశాఖ ఆలోచన.

ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డు రెండు రకాల టైమ్‌టేబుళ్లను ప్రతిపాదించింది. ఒకటి ప్రస్తుతం అమలవుతున్న సాధారణ విధానంలో ఉండగా, మరొకటి ప్రతి పరీక్షకు రెండు రోజుల విరామం ఉండేలా రూపొందించారు. ఈ విధానం అమలైతే విద్యార్థులకు పాఠ్యాంశాలను మరోసారి చదువుకునేందుకు, పునశ్చరణ చేసుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుందని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అభిప్రాయపడుతున్నారు. దీంతో రెండు రోజుల విరామం ఉండే షెడ్యూల్‌కు ఆమోదం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

గత ఏడాది పదో తరగతిలోనూ ఇదే ప్రయోగం

గత విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణలోనూ విద్యాశాఖ ఇదే తరహా విధానాన్ని అమలు చేసింది. మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13న ముగిశాయి. దాదాపు నెల రోజుల పాటు పరీక్షలు కొనసాగాయి. పండుగల కారణంగా కొన్ని సబ్జెక్టుల మధ్య నాలుగైదు రోజుల విరామం కూడా లభించింది.

అయితే పరీక్షల మధ్య ఇంత ఎక్కువ వ్యవధి అవసరం లేదంటూ విమర్శలు వచ్చినప్పటికీ విద్యాశాఖ తన నిర్ణయాన్ని కొనసాగించింది. ఈ విధానం వల్లే పదో తరగతిలో 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైందని, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 2.37 మేర పెరిగిందని విద్యాశాఖ సమర్థించుకుంది.

జేఈఈ, నీట్ విద్యార్థులకు కూడా ఊరట

ఇంటర్ విద్యార్థుల్లో చాలామంది డిసెంబరు లేదా సంక్రాంతి వరకు జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. ఆ తర్వాత వార్షిక పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరీక్షల మధ్య రెండు రోజుల విరామం ఉంటే పునశ్చరణకు మరింత సమయం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు పదో తరగతి పరీక్షల మధ్య వ్యవధిని తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇంటర్ పరీక్షలకు విరామం పెంచాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధికారిక టైమ్‌టేబుల్ విడుదలైన తర్వాతే పరీక్షల తేదీలు, మధ్యలో ఉండే విరామాలపై స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *