What Is Happening at NIMS Hospital? Repeated ACB Raids Trigger Speculation, Officials Maintain Silence on Findings

హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌ అరెస్టు తర్వాత పలుమార్లు దాడులు చేపట్టిన ఏసీబీ.. తనిఖీలకు సంబంధించిన వివరాలను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు, ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సిటీబ్యూరో, నవంబర్‌ 6: అవినీతి, అక్రమాల ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్న నిమ్స్‌ ఆస్పత్రిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించింది. అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌ను అరెస్టు చేసిన సమయంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన అధికారులు.. ఆ తర్వాత మూడు, నాలుగు విడతలుగా ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో ఏయే అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఎలాంటి ఆధారాలు లభించాయి? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఏసీబీ మౌనం కారణంగా నిమ్స్‌ పరిసరాల్లో, ఆస్పత్రి వర్గాల్లో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుండటంతో వాస్తవాలు ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలు ఆస్పత్రి ప్రతిష్టపై ప్రభావం చూపుతున్నాయని, నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సైతం ఆందోళనకు గురవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పలు విభాగాల రికార్డుల పరిశీలన

లక్ష్మీ భాస్కర్‌ అరెస్టు తర్వాత నిమ్స్‌లోని అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. సేకరించిన సమాచారం, ఆధారాల ఆధారంగా ఏసీబీ అధికారులు ఆస్పత్రిలో పలు విడతలుగా తనిఖీలు చేపట్టారు. మందుల కొనుగోళ్లు, మ్యాన్‌పవర్‌ టెండర్లు, క్యాంటీన్‌, మెడికల్‌ షాపులకు సంబంధించిన కాంట్రాక్టులు, వివిధ నియామకాలు, ఇతర విభాగాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం.

అయితే ఈ తనిఖీల్లో ఏవైనా అక్రమాలు గుర్తించారా? ఎవరిపైనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. మరోవైపు ఆస్పత్రిలో అవినీతి వ్యవహారాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు ఏసీబీ చర్యల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠ

వరుస తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు వాటి ఫలితాలను వెల్లడించకపోవడంతో నిమ్స్‌ వర్గాల్లో అయోమయం నెలకొంది. అవినీతి, అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తిస్తారా? లేక డాక్టర్‌ లక్ష్మీ భాస్కర్‌ అరెస్టుతోనే దర్యాప్తు పరిమితమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తనిఖీలకు సంబంధించిన వాస్తవాలను అధికారులు వెల్లడించాలని, ఆస్పత్రిలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఏసీబీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *