
Digital Payments | నగదు రహిత లావాదేవీల వినియోగంలో హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాల కంటే ముందంజలో నిలిచింది. నగరవాసులు చేసే మొత్తం ఖర్చులో 76 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అమెజాన్ పే, పహ్లే ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా రూపొందించిన ‘హౌ అర్బన్ ఇండియా పేస్ 2026’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
హైదరాబాద్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగం ప్రజల రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారిందని నివేదిక పేర్కొంది. రెస్టారెంట్లలో భోజనం చేయడం, ప్రయాణ ఖర్చులు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు ఇలా ప్రతి అవసరానికీ నగరవాసులు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఉద్యోగులు డిజిటల్ లావాదేవీల వినియోగంలో ముందున్నారని వివరించింది.
ఉద్యోగుల్లో యూపీఐ వినియోగం అధికం
దేశ సగటుతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఉద్యోగులు హోటళ్లలో భోజనం, ప్రయాణాల కోసం యూపీఐ చెల్లింపులు చేయడం 16 శాతం అధికంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. దీనిని బట్టి నగరంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేవలం కొనుగోళ్లు, చెల్లింపులకే పరిమితం కాకుండా పొదుపు, ఆర్థిక నిర్వహణ కోసం కూడా నగరవాసులు డిజిటల్ వేదికలను ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆటోమేటిక్ పొదుపు సదుపాయాలను వినియోగించడంలోనూ హైదరాబాద్ ప్రజలు దేశ సగటు కంటే 13 శాతం ముందున్నారు.
క్యాష్‌బ్యాక్ కోసం యాప్‌లు మారుస్తున్న వినియోగదారులు
డిజిటల్ చెల్లింపుల యాప్‌లను ఎంచుకునే విషయంలోనూ హైదరాబాద్ వినియోగదారులు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. మెరుగైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు అందించే యాప్‌లకు మారేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.
ఈ తరహా వినియోగదారుల సంఖ్య హైదరాబాద్‌లో 50 శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మెరుగైన సేవలు, ఆకర్షణీయమైన ఆఫర్లు, అదనపు ప్రయోజనాలు అందించే డిజిటల్ చెల్లింపుల యాప్‌లకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించింది.
మొత్తంగా చూస్తే హైదరాబాద్‌లో డిజిటల్ చెల్లింపులు కేవలం నగదు బదిలీ సాధనంగా మాత్రమే కాకుండా, రోజువారీ ఖర్చులు, పొదుపు, ఆర్థిక నిర్వహణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. నగరవాసుల్లో పెరుగుతున్న డిజిటల్ అవగాహనకు ఈ నివేదిక గణాంకాలు అద్దం పడుతున్నాయి.
