అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల గ్రూపుల్లో పెరుగుతున్న విభేదాలు

చిన్నచిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారుతున్న వైనం.. పోలీస్ స్టేషన్లకు చేరుతున్న ఫిర్యాదులు
హైదరాబాద్: ఒకే అపార్ట్మెంట్లో నివసించే కుటుంబాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాల్సిన చోట సామాజిక మాధ్యమాల పోస్టులు చిచ్చుపెడుతున్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో చేసే వ్యాఖ్యలు, ఫేస్బుక్లో ఫొటోలకు వచ్చే లైక్‌లు, కామెంట్లు మనస్పర్థలకు కారణమవుతున్నాయి. చిన్నగా మొదలయ్యే ఈ వివాదాలు క్రమంగా ముదిరి కుటుంబాల మధ్య దూరం పెంచడమే కాకుండా పోలీస్ స్టేషన్ల వరకు చేరుతున్నాయి.
యూసుఫ్‌గూడలోని ఓ అపార్ట్మెంట్లో 12 కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడి వారంతా కలిసి ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపులో రోజువారీ సమస్యలపై చర్చించుకుంటుంటారు. నీటి బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో తాగునీటి సరఫరా సరిగా జరగడం లేదని ఓ సభ్యుడు గ్రూపులో పోస్టు చేశారు. దీనిపై ఇద్దరు స్పందించడంతో మొదలైన చర్చ కాస్తా వాగ్వాదానికి దారితీసింది. చివరకు వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. దీంతో అప్పటివరకు స్నేహంగా మెలిగిన నాలుగు కుటుంబాల మధ్య దూరం పెరిగింది.
లంగర్‌హౌస్ పరిధిలోని మరో అపార్ట్మెంట్లో పదేళ్లుగా పది కుటుంబాలు కలిసి ఉంటున్నాయి. అక్కడి గృహిణులు కిట్టీపార్టీల కోసం ఫేస్బుక్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో పోస్టు చేసిన ఫొటోలకు కొందరు మాత్రమే లైక్‌లు ఇవ్వడం మిగిలిన వారికి నచ్చలేదు. ఈ చిన్న విషయమే మనస్పర్థలకు కారణమై, ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితికి దారితీసింది. పండగలు, పుట్టినరోజు వేడుకల్లో కలిసి సందడి చేసే కుటుంబాల మధ్య కూడా కలహాలు మొదలయ్యాయి. అప్పటివరకు సర్దుకుపోయిన వారంతా శత్రువుల్లా మారిపోయారని ఓ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తన అనుభవాన్ని పంచుకున్నారు.
సామాజిక మాధ్యమాలతో పెరుగుతున్న వివాదాలు
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం ఎంతోమంది హైదరాబాద్‌కు వస్తుంటారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తూ భాష, కులం, మతం, సంస్కృతులకు అతీతంగా కలిసిమెలిసి ఉంటారు. అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జరిగే చర్చలు వారి మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. చిన్నపాటి అపార్థాలు క్రమంగా పెద్ద గొడవలుగా మారుతున్నాయి.
కొంతమంది ఈ వివాదాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా, కేసు నమోదు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్న వారు కూడా ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. నగరంలో ప్రతి నెలా 20 నుంచి 30కి పైగా ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు.
పార్కింగ్ నుంచి తాగునీటి వరకు.. ప్రతి అంశంపైనా రచ్చ
ఒకే అపార్ట్మెంట్లో నివసించే కుటుంబాలు సమాచార మార్పిడికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. సంక్షేమ సంఘాల ప్రతినిధులు కూడా అందులోనే సమావేశాలు, నిర్వహణ ఖర్చులు, ఇతర వివరాలను తెలియజేస్తుంటారు. కారు పార్కింగ్, పారిశుద్ధ్యం, విద్యుత్తు, తాగునీరు, వాచ్మెన్ వంటి అంశాలపై చర్చలు జరుగుతుంటాయి.
నెలవారీ నిర్వహణ ఖర్చులు సక్రమంగా చెల్లించని వారికి సేవలు నిలిపివేయాలంటూ కొందరు సభ్యులు గ్రూపుల్లో స్పందించినప్పుడు వివాదాలు మొదలవుతున్నాయని నగరానికి చెందిన ఓ ఇన్స్పెక్టర్ తెలిపారు. గ్రూపుల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, ప్రత్యక్షంగా ఎదురుపడినప్పుడు భౌతిక దాడులకు దిగుతున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి.
జూబ్లీహిల్స్‌లోని ఓ కాలనీలో మహిళలు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో ఓ గృహిణి తన కుమార్తెకు ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని గ్రూపులో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన మరో ఉద్యోగిని.. తల్లిదండ్రులు క్రమశిక్షణతో ఉంటేనే పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్‌ను మరో సభ్యురాలు తప్పుగా భావించడంతో మొదలైన వివాదం పరస్పర విమర్శలకు దారితీసింది.
ఈ గొడవల ప్రభావం సామాజిక కార్యక్రమాలపైనా పడింది. ఈ ఏడాది బోనాలు, వినాయకచవితి, దసరా వేడుకలను కూడా వేర్వేరుగా నిర్వహించుకోవాల్సి వచ్చిందని ఓ అపార్ట్మెంట్ నివాసి ఆవేదన వ్యక్తం చేశారు.
స్నేహాలు దూరం.. కుటుంబాల మధ్య శత్రుత్వం
ఒకప్పుడు ప్రాణస్నేహితులుగా ఉన్నవారు కూడా సామాజిక మాధ్యమాల్లోని చిన్నచిన్న వివాదాల కారణంగా బద్ధశత్రువులుగా మారుతున్నారని పోలీసులు చెబుతున్నారు. కులం, మతం, వ్యక్తిగత అంశాలపై గ్రూపుల్లో పోస్టులు పెట్టినప్పుడు ఎక్కువగా గొడవలు తలెత్తుతున్నట్టు దర్యాప్తులో గుర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వివాదాలు దాడుల వరకు వెళ్తున్నాయి.
పరిధి దాటి ప్రవర్తించే వారిపై పెట్టీ కేసులు నమోదు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేసే సమయంలో సంయమనం పాటించకపోతే, కలిసి జీవించే కుటుంబాల మధ్య అనవసరమైన దూరం పెరిగే ప్రమాదం ఉందని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
