Hyderabad to Get Brighter: Telangana Govt Approves ₹1,720 Crore Streetlight Maintenance Project for 10 Years

Hyderabad | హైదరాబాద్ నగరంలో రెండేళ్లుగా కొనసాగుతున్న వీధి దీపాల సమస్యకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలోని మూడు కార్పొరేషన్లలో వీధి దీపాల నిర్వహణ కోసం పదేళ్ల కాలపరిమితితో రూ.1,720.83 కోట్ల ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వీధి దీపాల నిర్వహణ ప్రాజెక్టుకు తొలుత 2026 మార్చి 6న రూ.1,341.60 కోట్లతో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న సంస్థలు ప్రభుత్వ అంచనా వ్యయం కంటే ఎక్కువ మొత్తాలను కోట్ చేశాయి. దీంతో ప్రాజెక్టు వ్యయాన్ని సవరించి రూ.1,720.83 కోట్లకు పెంచారు.

టెండర్లలో బీఏసీ ఇన్‌ఫ్రాటెక్‌-విన్సీ గ్లోబల్ (జేవీ) సంస్థ ఒక్కో లైట్ నిర్వహణకు నెలకు రూ.153.60 చొప్పున కోట్ చేసింది. ఇది నిర్ణయించిన బెంచ్‌మార్క్ ధర కంటే 4.49 శాతం ఎక్కువ. మరో సంస్థ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌-మ్యాట్రిక్స్ మీటర్స్ కన్సార్టియం నెలకు రూ.153.90గా ధరను ప్రతిపాదించింది. ఇది బెంచ్‌మార్క్ కంటే 4.69 శాతం అధికం.

ఈ రెండు సంస్థల ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం తక్కువ ధర కోట్ చేసిన బీఏసీ ఇన్‌ఫ్రాటెక్‌-విన్సీ గ్లోబల్ జేవీకి పనులు అప్పగించాలని నిర్ణయించింది. పెరిగిన టెండర్ విలువకు కూడా పరిపాలనా అనుమతి ఇచ్చింది.

7.6 లక్షల వీధి దీపాల నిర్వహణ

మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 7.6 లక్షల వీధి దీపాలు ఉన్నాయి. టెండర్ నిబంధనల ప్రకారం నవంబర్ నెలాఖరులోగా ఒప్పందాలు, ఇతర ప్రక్రియలను పూర్తి చేయనున్నారు. డిసెంబర్ నుంచి ఎంపికైన సంస్థ వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది.

ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి మూడు నెలల్లో మూడు కార్పొరేషన్లకు ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డులను రూపొందిస్తారు. ఆరు నెలల్లోగా అన్ని వీధి దీపాలను కంట్రోల్ యూనిట్లకు అనుసంధానం చేసి, డ్యాష్‌బోర్డుతో లింక్ చేస్తారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎన్ని లైట్లు పనిచేస్తున్నాయి? ఎక్కడ మరమ్మతులు అవసరం? అనే వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

రోజూ 98 శాతం లైట్లు వెలగాల్సిందే!

వీధి దీపాల నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ కనీసం 98 శాతం లైట్లు వెలగాలనే నిబంధన విధించారు. కార్పొరేషన్ల వారీగా పనిచేస్తున్న లైట్ల శాతాన్ని లెక్కించి కాంట్రాక్టు సంస్థకు బిల్లులు చెల్లించనున్నారు. దీనివల్ల నిర్వహణ సంస్థ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.

గుత్తేదారు సంస్థ పనితీరును అంచనా వేయడానికి ప్రత్యేకంగా మూడో సంస్థను నియమించనున్నారు. ఈ బాధ్యతను ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించింది. డిసెంబర్ నుంచి వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేయడం, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడం కాంట్రాక్టు సంస్థ బాధ్యతగా ఉంటుంది.

ఇక మరింత వెలుతురు ఇచ్చే ఎల్‌ఈడీ లైట్లు

వీధుల్లో వెలుతురు నాణ్యతను పెంచేందుకు ప్రస్తుతం ఉన్న లైట్ల స్థానంలో ఎక్కువ వాటేజీ కలిగిన బల్బులను ఏర్పాటు చేయనున్నారు. గతంలో 18 వాట్ల లైట్లు ఉన్న చోట 25 వాట్ల బల్బులు, 35 వాట్ల స్థానంలో 40 వాట్ల బల్బులు అమర్చనున్నారు.

అలాగే 70 వాట్ల లైట్లకు బదులుగా 65 నుంచి 90 వాట్ల బల్బులను, 110 వాట్ల లైట్ల స్థానంలో 90 నుంచి 120 వాట్ల సామర్థ్యం కలిగిన బల్బులను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.

ఈ ప్రాజెక్టు అమలుతో హైదరాబాద్‌లో వీధి దీపాల నిర్వహణ మరింత మెరుగుపడటంతో పాటు, వెలగని లైట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రానున్న రోజుల్లో నగర వీధులు మరింత ప్రకాశవంతంగా మారనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *