ఖమ్మం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సీతారామ ప్రాజెక్టు రైతులకు భరోసాగా నిలుస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అక్టోబర్‌లో యాతాలకుంట టన్నెల్‌ పనులను పూర్తి చేసి అదే నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలను తీసుకొస్తామని తెలిపారు.

సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం పంపుహౌస్‌ వద్ద మంత్రి స్విచ్‌ ఆన్‌ చేసి ట్రయల్‌రన్‌ నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. పాములేరు వాగుపై రూ.4.5 కోట్లతో నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జిని ప్రారంభించారు.

తర్వాత ఖమ్మం జిల్లా సత్తుపల్లి పరిధిలోని యాతాలకుంట టన్నెల్‌ను మంత్రి పరిశీలించారు. సుమారు 4.5 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి టన్నెల్‌ వద్దకు చేరుకున్నారు. టన్నెల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కింది భాగంలో ఖాళీలు ఉన్నట్లు గుర్తించిన మంత్రి వాటిని కాంక్రీట్‌తో పూర్తిస్థాయిలో ప్యాకింగ్‌ చేసి పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు.

భూసేకరణ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి రూ.48 కోట్ల నిధులు మంజూరు చేశారని తుమ్మల తెలిపారు. యాతాలకుంట టన్నెల్‌ ద్వారా సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలను అందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

By Rajini