
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మిస్తున్న తెలంగాణ భవన్ డిజైన్లలో తెలంగాణ సంస్కృతి, చరిత్ర, శిల్పకళ ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి వంటి చారిత్రక కట్టడాల శిల్ప, వాస్తు కళను పరిశీలించి వాటి స్ఫూర్తితో నిర్మాణాల డిజైన్లు రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా వరంగల్ విమానాశ్రయం డిజైన్‌లో కాకతీయుల చరిత్ర, సంస్కృతి స్పష్టంగా ప్రతిబింబించేలా చూడాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్రవాహాల మళ్లింపు, రహదారుల మార్పు, బీఎస్‌ఎన్‌ఎల్ లైన్లు, తాగునీటి సరఫరా పైప్‌లైన్ల తరలింపు తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు.
విమానాశ్రయాల కాంపౌండ్ వాల్ సమీపం నుంచి రహదారులు నిర్మించి వాటిని జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులతో అనుసంధానించాలని సీఎం సూచించారు. విమానాశ్రయాలకు రాకపోకలు సాగించే రహదారులు విశాలంగా ఉండటంతో పాటు సమీపంలోని ప్రధాన రహదారులకు సులభంగా అనుసంధానమయ్యేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
వివిధ శాఖలు విడివిడిగా పనులు చేపడితే సమన్వయ లోపంతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. విద్యుత్, ఆర్‌అండ్‌బీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతోనూ చర్చించాలని సూచించారు. అన్ని పనులను ఒకేసారి చేపట్టేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాల మౌలిక వసతుల ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. వాగులు ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. విమానాశ్రయ ప్రాంగణంలో లేదా సమీప ప్రాంతాల్లో చెరువులు నిర్మించి వాటి ద్వారా నీటి ప్రవాహాలను మళ్లించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
