
D Educt: Sept 23: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్పై కొత్త నిబంధనలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. పాఠశాలల్లో అల్పాహారం, పాలు పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులంతా ఉదయం 9.30 గంటలలోపు టిఫిన్, పాలు తీసుకునే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి నిర్ణీత సమయంలో అల్పాహారం
విద్యార్థులకు అల్పాహారం సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ సూచించింది. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా ఉదయం 6.30 గంటల నుంచి 8.45 గంటల మధ్య పాఠశాలలకు టిఫిన్ సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. నిర్ణయించిన సమయపాలన కచ్చితంగా అమలయ్యేలా సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.
అక్టోబర్ నాటికి అన్ని పాఠశాలలకు విస్తరణ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్’ పథకాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ పథకాన్ని ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హెచ్ఎంలకు ఇండెంట్పై కీలక మార్గదర్శకాలు
మరుసటి రోజు పాఠశాలలో ఎంత మంది విద్యార్థులకు అల్పాహారం అవసరమో ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు) ముందుగానే నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలలోపు ప్రత్యేక యాప్ లేదా వెబ్సైట్ ద్వారా అవసరమైన విద్యార్థుల సంఖ్యను ఇండెంట్ రూపంలో సమర్పించాలని విద్యాశాఖ ఆదేశించింది.
నిర్దేశించిన సమయం దాటిన తర్వాత ఇండెంట్ సమర్పించే అవకాశం ఉండదని, సిస్టమ్లో అది ఆటోమేటిక్గా లాక్ అవుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో పాఠశాలలకు అవసరమైన అల్పాహారం సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు హెచ్ఎంలు నిర్ణీత గడువులోగా ఇండెంట్ సమర్పించాలని సూచించారు.
