హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్‌తో పాటు జీహెచ్‌ఎంసీ, సీడీఎంఏ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే పోలీసులకు అందించాలని నిర్వాహకులను కోరారు.

మండపాల వివరాలు ముందుగా అందుబాటులో ఉంటే ట్రాఫిక్ నియంత్రణ బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు సమర్థంగా నిర్వహించేందుకు వీలుంటుందని చెప్పారు. మండపాలకు అతిథులను ఆహ్వానించే సందర్భంలో వారి వివరాలను స్థానిక పోలీసు కమిషనరేట్‌కు అందించాలని సూచించారు. అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు.

గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా చెరువుల అభివృద్ధి పనులు చేపట్టే సమయంలోనే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చెరువుల చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు మున్సిపల్ పోలీసు శాఖలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పర్యవేక్షణ సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.

By Rajini