
D Spiritual: Sept 12: గణేష్ ఉత్సవ్:హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఆవరణలోని శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం గణేశ్ మండపాల నిర్వాహకులు కూడా పోలీస్, అధికారులకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్: తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మండపాల నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు.
గణేశ్ మండపాలకు ప్రముఖులు, అతిథులను ఆహ్వానిస్తే.. వారి వివరాలను స్థానిక పోలీస్ కమిషనరేట్‌కు ముందుగానే అందించాలని సీఎం సూచించారు. అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందని వివరించారు.
మండపాల వివరాలు ముందుగానే ఇవ్వాలి: హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. మండపాల వివరాలు అందుబాటులో ఉంటే ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు సమర్థంగా నిర్వహించగలరని చెప్పారు.
అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ కుంటలు ఏర్పాటు చేస్తున్న తరహాలోనే గణేశ్ నిమజ్జనాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ దశలోనే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువుల చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్ తదితరులు హాజరయ్యారు.
