
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన నగర అభివృద్ధిపై హైదరాబాద్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
హైదరాబాద్ అభివృద్ధిపై గత ప్రభుత్వ హయాంలోనూ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినా స్పందన రాలేదని రాజాసింగ్ అన్నారు. నగర అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. నియోజకవర్గాల్లోని సమస్యలు స్థానిక ఎమ్మెల్యేలకే క్షుణ్ణంగా తెలుస్తాయని ప్రతి డివిజన్‌లోని సమస్యలను పరిష్కరించినప్పుడే హైదరాబాద్ నిజమైన గ్లోబల్ సిటీగా మారుతుందని పేర్కొన్నారు.
నగరంలో చాలా రహదారులు దెబ్బతిన్నాయని డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదని రాజాసింగ్ అన్నారు. బస్తీల్లో సరఫరా చేస్తున్న తాగునీటిలో డ్రైనేజీ నీరు కలుస్తున్న పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోమల బెడద కూడా తీవ్రంగా ఉందని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే అంశంపై కూడా సమగ్ర చర్చ జరగాలని రాజాసింగ్ సూచించారు. కార్పొరేషన్ల ఏర్పాటు మాత్రమే కాకుండా నగరానికి మెరుగైన మౌలిక వసతులు సమర్థవంతమైన పాలన అందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యాయని, ఇంకా 15 నెలల సమయం మాత్రమే ఉందని రాజాసింగ్ గుర్తు చేశారు. ఈ సమయంలో మూసీ అభివృద్ధి పనులు పూర్తవుతాయా అని ప్రశ్నించారు.
మూసీ ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతున్నాయని విమర్శించారు. 20 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని ప్రభుత్వంపై రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ ఉందా? లేదా? అనే అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అధికారులను ఎన్నిసార్లు కోరినా స్పందించడం లేదని ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలన్నది నగరవాసుల చిరకాల కోరిక అని రాజాసింగ్ అన్నారు. ప్రతి ప్రభుత్వమూ హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మారుస్తామని చెబుతున్నప్పటికీ ఆ హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను మెరుగైన గ్లోబల్ సిటీగా చూడటమే తన కల అని పేర్కొన్న ఆయన నగర ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై వారి సూచనలు సలహాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
