
D-News: భారత్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలైన MSMEsకు క్రెడిట్ అందుబాటును పెంచేందుకు B2B డిజిటల్ వ్యవస్థ కీలకంగా మారొచ్చని Bain & Company, NPCI Bharat BillPay Limited (NBBL) నివేదిక తెలిపింది. దేశంలోని వివిధ డిజిటల్ బిజినెస్ వ్యవస్థలను అనుసంధానం చేస్తే లావాదేవీలు వేగవంతం కావడంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ అందుబాటులోకి రావచ్చని పేర్కొంది.
రూ.60 లక్షల కోట్లకు పైగా క్రెడిట్ లోటు
భారత్‌లో MSME రంగం ఎదుర్కొంటున్న క్రెడిట్ షార్ట్‌ఫాల్ రూ.60 లక్షల కోట్లకు పైగా ఉందని Bain-NBBL అంచనా వేసింది. ఇందులో 70 శాతానికి పైగా స్వల్పకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు సంబంధించినదని నివేదిక తెలిపింది. చిన్న సంస్థల రుణ అవసరాల్లో కేవలం 30–40 శాతం మాత్రమే అధికారిక ఆర్థిక వ్యవస్థ ద్వారా అందుతున్నట్లు పేర్కొంది.
B2B వ్యవస్థలు అనుసంధానం అయితే..
ప్రస్తుతం కంపెనీల ERP వ్యవస్థలు, బ్యాంకులు, ఇన్వాయిస్‌లు, పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. దీంతో వ్యాపార లావాదేవీల పూర్తి సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండటం లేదు. ఈ వ్యవస్థలను స్టాండర్డైజ్డ్ APIs ద్వారా అనుసంధానం చేస్తే ఇన్వాయిస్‌లు, చెల్లింపులు, ఇతర వ్యాపార సమాచారంతో కూడిన ఒక సాధారణ డిజిటల్ రికార్డు ఏర్పడుతుంది. దీంతో రీకన్సిలియేషన్ ప్రక్రియ ఆటోమేట్ కావచ్చు. మాన్యువల్ పని తగ్గుతుంది. అలాగే రుణదాతలకు ధృవీకరించిన లావాదేవీల డేటా అందుతుంది.
MSMEలకు వేగంగా రుణాలు
కొనుగోలుదారులు ధృవీకరించిన ఇన్వాయిస్‌ల ద్వారా ఆలస్యంగా ఉన్న సుమారు రూ.8 లక్షల కోట్ల MSME బకాయిలను ఫైనాన్స్‌కు అనుకూలమైన రికార్డులుగా మార్చవచ్చని నివేదిక అంచనా వేసింది. దీంతో దేశంలోని సుమారు 8 కోట్ల MSMEలకు ప్రయోజనం కలగవచ్చని తెలిపింది. ఈ సంస్థలు కలిపి దేశ GDPలో దాదాపు 30 శాతం వాటా కలిగి ఉన్నాయని పేర్కొంది. నిజమైన క్యాష్‌ఫ్లో ఆధారంగా రుణాలు ఇవ్వడం కూడా సులభమవుతుంది. బ్యాంకులు, ఫైనాన్షియర్లకు కంపెనీల వ్యాపార కార్యకలాపాలపై మెరుగైన సమాచారం అందుతుంది.
AIతో మరింత వేగం
భవిష్యత్తులో అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, జనరేటివ్ AI కూడా ఈ వ్యవస్థకు ఉపయోగపడవచ్చని నివేదిక తెలిపింది. క్యాష్‌ఫ్లో విశ్లేషణ, డైనమిక్ రిస్క్ స్కోరింగ్, ఆటోమేటెడ్ క్రెడిట్ అండర్‌రైటింగ్ వంటి సేవలను AI ద్వారా మరింత సమర్థంగా నిర్వహించవచ్చని పేర్కొంది. ఈ విధానం దేశంలో ఒక “India B2B Operating System” తరహా డిజిటల్ మౌలిక వసతికి దారితీయవచ్చని నివేదిక అభిప్రాయపడింది.
అమలుకు సమన్వయం అవసరం
అయితే ఈ వ్యవస్థను పెద్ద స్థాయిలో అమలు చేయడానికి పలు అంశాలపై స్పష్టత అవసరమని Bain-NBBL తెలిపింది. సరళమైన టెక్నాలజీ ఇంటిగ్రేషన్, వ్యాపార సంస్థల వేగవంతమైన ఆన్‌బోర్డింగ్, డేటా షేరింగ్ నిబంధనలు, బాధ్యతలపై స్పష్టత అవసరమని పేర్కొంది. అదే సమయంలో విశ్వసనీయత కోసం ఒక తటస్థ, ఓపెన్, నియంత్రిత జాతీయ సంస్థ అవసరమని నివేదిక సూచించింది. ఇలాంటి అనుసంధానిత B2B డిజిటల్ వ్యవస్థలు విస్తరిస్తే చిన్న వ్యాపారాలకు క్రెడిట్ అందుబాటు పెరగడంతో పాటు భారత్ ఆర్థిక వృద్ధికి, MSMEల విస్తరణకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.
