
రాష్ట్రవ్యాప్తంగా కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జన్మాష్టమిని పురస్కరించుకుని ఆలయాలను పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వేణుగోపాలుడి దర్శనం కోసం భక్తులు ఆలయాలకు తరలివచ్చి బారులు తీరారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. వేడుకల్లో భాగంగా పలుచోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు సంబరాలు చేసుకుంటున్నారు.
అబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో భారీగా భక్తులు
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అబిడ్స్ ఇస్కాన్ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం నగరం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జన్మాష్టమిని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనం, క్యూలైన్ ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భజనలు, కీర్తనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
కొమురవెళ్లిలో యాదవ సంప్రదాయంలో వేడుకలు
సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామివారి ఆలయంలో యాదవ పూజారుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదవ సంప్రదాయం ప్రకారం స్వామివారికి యాదవులు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీకృష్ణుడు, గొల్లభామ వేషధారణలో యాదవ పూజారులు ఉట్టి కొట్టి వేడుకలను నిర్వహించారు. ఆలయ పురవీధుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కట్టా సుధాకర్ రెడ్డి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
