
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సదస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో-2026ను ప్రారంభించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం కోరారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రక్షణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు రక్షణ రంగ అభివృద్ధి ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో పెట్టుబడులు పరిశ్రమల విస్తరణపై చర్చించారు.
హైదరాబాద్‌లో నిర్వహించనున్న రక్షణ ఎక్స్పో-2026లో ఏరోస్పేస్ డిఫెన్స్ స్పేస్ రంగాలపై ప్రత్యేక సదస్సు, ప్రతిష్టాత్మక ఎయిర్‌షో పారిశ్రామిక ప్రదర్శనతో పాటు భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు స్టార్టప్‌లు యువ శాస్త్రవేత్తలు ఈ ఎక్స్‌పోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
రక్షణ ఎక్స్‌పోకు హాజరై పాల్గొనే సంస్థలు, యువ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేస్తే అది వారికి ఎంతో స్ఫూర్తినిస్తుందని రాజ్‌నాథ్ సింగ్‌తో రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్పోను విజయవంతంగా నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకారం అందించాలని కోరారు.
ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు మంజూరు చేయడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా సహకరించాలని కోరారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఉంచడంతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగస్వాములయ్యేలా చూడాలని అభ్యర్థించారు.
హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ తదితర రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్థలతో పాటు డీఆర్డీవోకు చెందిన ప్రయోగశాలలు విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం కోరారు. విదేశీ రక్షణ శాఖల ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్ విమానాశ్రయానికి 1,500 ఎకరాలు
ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రికి వివరించారు. రక్షణ శాఖ మొత్తం 1,500 ఎకరాలు కోరిందని, మిగిలిన 750 ఎకరాలను కూడా సేకరించి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
డీఆర్డీఎల్ ప్రాజెక్టుకు 416 ఎకరాలు
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఇప్పటికే అంగీకరించిందని సీఎం తెలిపారు. మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 ఏళ్ల పాటు భూమిని కేటాయించనున్నట్లు వివరించారు. అవసరమైతే మరో రెండు పర్యాయాలు లీజును పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కార వేణుగోపాల్ పాల్గొన్నారు.
