D-News: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండియన్‌ఆయిల్‌ లాభదాయకతపై ఒత్తిడి కొనసాగిందని సంస్థ చైర్మన్‌ ఏఎస్‌ సహ్నీ తెలిపారు. అయితే సంస్థ కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయని, క్లిష్ట పరిస్థితుల్లోనూ కంపెనీ సామర్థ్యం, స్థిరత్వంపై విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

ఇండియన్‌ఆయిల్‌ 67వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సహ్నీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ కంపెనీ రిఫైనరీలు రికార్డు స్థాయిలో ముడిచమురును శుద్ధి చేసినట్లు తెలిపారు.

రిఫైనరీల సామర్థ్య వినియోగం 109.4 శాతం

2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండియన్‌ఆయిల్‌ రిఫైనరీలు 19.17 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ముడిచమురును శుద్ధి చేశాయి. సామర్థ్య వినియోగం 109.4 శాతానికి చేరింది. దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాల్లో కంపెనీ మార్కెట్‌ వాటా కూడా 43.1 శాతానికి పెరిగింది.

పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో ముడిచమురు కొనుగోళ్లను వివిధ దేశాలకు విస్తరించడంతో పాటు రిఫైనరీ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించి, సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు సహ్నీ వివరించారు.

మధ్యప్రాచ్య దేశాల నుంచి ముడిచమురు సరఫరాను గణనీయంగా తగ్గించినప్పటికీ రిఫైనరీలు 100 శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేశాయని తెలిపారు. తక్కువ సమయంలోనే ఎల్‌పీజీ ఉత్పత్తిని దాదాపు 30 శాతం పెంచినట్లు వెల్లడించారు.

రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని భారీగా పెంపు

పానిపట్‌, గుజరాత్‌, బరౌనీ రిఫైనరీల విస్తరణ ప్రాజెక్టులు పూర్తయితే ఇండియన్‌ఆయిల్‌ గ్రూప్‌ మొత్తం రిఫైనింగ్‌ సామర్థ్యం ప్రస్తుత 80.75 MMT నుంచి దాదాపు 98 MMTకు పెరుగుతుందని సహ్నీ తెలిపారు.

భారత్‌ రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని 300 MMT స్థాయికి పెంచుకునే దిశగా ముందుకు సాగుతున్న సమయంలో, అదనంగా ఏర్పడే సామర్థ్యంలో 40 శాతానికి పైగా ఇండియన్‌ఆయిల్‌ వాటా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

సహజ వాయువు, గ్రీన్‌ ఎనర్జీపై దృష్టి

భవిష్యత్‌ వృద్ధి కోసం కంపెనీ సంప్రదాయ ఇంధన రంగంతో పాటు కొత్త ఇంధన రంగాలపై కూడా దృష్టి పెడుతోంది. 2030 నాటికి సహజ వాయువు విక్రయాలను 1.5 రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2031 నాటికి అప్‌స్ట్రీమ్‌ కార్యకలాపాల వాటాను 10 శాతానికి పైగా పెంచాలని భావిస్తోంది.

అదే సమయంలో పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజన్‌, సస్టైనబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌ (SAF) వంటి అభివృద్ధి చెందుతున్న ఇంధన రంగాల్లోనూ పెట్టుబడులను విస్తరిస్తోంది.

దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ రిఫైనరీలు, పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌, ఇంధన కేంద్రాలు, ఎల్‌పీజీ పంపిణీ వ్యవస్థతో ఇండియన్‌ఆయిల్‌ దేశ ఇంధన భద్రతలో కీలక పాత్ర పోషిస్తోందని సహ్నీ పేర్కొన్నారు.