
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సోమవారం ‘సమరభేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గోదావరిఖని పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లావణ్య మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు అందలేదని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీల అమలులో విఫలమైందని మండిపడ్డారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉందని లావణ్య తెలిపారు. అమృత్ నిధుల కింద రామగుండానికి వందల కోట్ల రూపాయలు మంజూరైన విషయాన్ని గుర్తుచేశారు. నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమలుపై ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీ మాట్లాడుతూ.. రామగుండంలో అభివృద్ధి పేరుతో కూల్చివేతలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేపట్టడంలో ప్రభుత్వం విఫలమై ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని విమర్శించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మామిడి రాజేష్, మాతంగి రేణుక, నరహరి, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
