తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలోని ప్రతి భూమిలేని పేద కుటుంబానికి ఎకరం భూమి అందించేలా ‘భూలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తామని ఆమె తెలిపారు.
ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కవిత సామాజిక న్యాయానికి భూమి యాజమాన్య హక్కులు ఎంతో కీలకమని పేర్కొన్నారు. పేదల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం ఈ పథకాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన భూమిలేని పేద కుటుంబాలకు వ్యవసాయ భూమి అందించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ‘భూలక్ష్మి’ పథకం లక్ష్యమని కవిత తెలిపారు.
అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం అసైన్‌మెంట్ భూములు సాగు చేస్తున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కవిత డిమాండ్ చేశారు. భూమిపై హక్కు కల్పించడం ద్వారా పేద కుటుంబాలకు శాశ్వత భద్రత, సామాజిక గౌరవం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.

