
బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. గురువారం డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేలు కాగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీతో అందజేయనున్నారు.
ఈ పథకానికి అర్హులైన బీసీ మహిళల నుంచి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ మహిళలు ఇంటి నుంచే ఉపాధి పొందేలా చేయడమే పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులతో పాటు కుట్టు వృత్తిలో ఇప్పటికే అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు కుట్టు మిషన్ల వినియోగంపై లబ్ధిదారులకు అవసరమైన శిక్షణ కూడా అందించనున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ, ఇతర రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. అదే తరహాలో కుట్టు మిషన్ల పథకం ద్వారా మహిళలు ఇంటి వద్దే ఉపాధి పొందేలా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులను పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణన అనంతరం బీసీల అభివృద్ధికి సంబంధించిన తదుపరి కార్యాచరణను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
