
D News: Aug 8: హైదరాబాద్లో అకస్మిక వర్షాలు.. 15 నిమిషాల్లోనే రోడ్లు జలమయం
హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి. ఉరుములు, మెరుపులు లేకుండానే ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేవలం 15 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. అయితే వర్షం ఎంత వేగంగా మొదలవుతుందో, అంతే వేగంగా ఆగిపోతుండటం గమనార్హం. వాన ఆగిన కొద్దిసేపటికే ఆకాశం మళ్లీ నిర్మలంగా మారుతోంది. దీంతో ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
వాతావరణ నిపుణుల ప్రకారం, స్థానికంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అధిక ఆర్ద్రత కారణంగా ఒక్కసారిగా మేఘాల సాంద్రత పెరుగుతోంది. దీంతో ‘పాసింగ్ షవర్స్’ లేదా విడతల వారీగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరహా వర్షాల్లో 15 నుంచి 30 నిమిషాల్లోనే భారీగా వర్షపాతం నమోదై రోడ్లపై నీరు నిలిచిపోతోంది. అయితే కొద్దిసేపటికే మేఘాలు విడిపోవడంతో వాతావరణం తిరిగి పొడిగా మారుతోంది.
హైదరాబాద్ వర్షం:ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి
ముందస్తు హెచ్చరిక లేకుండా ఒక్కసారిగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, బాటసారులు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అకస్మిక వర్షాల సమయంలో రహదారులపై నీరు నిలిచే ప్రాంతాల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణం కొద్దిసేపట్లోనే పూర్తిగా మారిపోయే అవకాశం ఉన్నందున బయటకు వెళ్లే ముందు వాతావరణ పరిస్థితులను గమనించడంతో పాటు, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
