
D News: Aug 8: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన శ్రీకాంత్.. ప్రస్తుతం సహాయ నటుడిగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోగా ఉన్న సమయంలో ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషిస్తూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్ తన సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్లో బెస్ట్ కో-స్టార్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. దివంగత నటి సౌందర్య పేరు చెప్పారు. ఆమెతో కలిసి తాను దాదాపు ఆరు సినిమాల్లో నటించానని, తమ మధ్య కేవలం నటీనటుల సంబంధమే కాకుండా కుటుంబ సభ్యుల్లాంటి అనుబంధం ఉండేదని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నారు.
సౌందర్య తల్లిదండ్రులు, ఆమె సోదరుడు కూడా తనకు ఎంతో సన్నిహితులని శ్రీకాంత్ తెలిపారు. సౌందర్య ఎంతో సౌమ్య స్వభావం కలిగిన వ్యక్తి అని, కుటుంబంలో ఒక అమ్మాయిలా అందరితో కలిసిమెలిసి ఉండేవారని చెప్పారు. ఆమెను చాలామంది హీరోలు ఎంతో గౌరవించేవారని, ఆమె వ్యక్తిత్వం అంత గొప్పదని శ్రీకాంత్ పేర్కొన్నారు.
నటన విషయంలోనూ సౌందర్యను శ్రీకాంత్ ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె నటనలో దివంగత మహానటి సావిత్రి గారి ఛాయలు కనిపించేవని అన్నారు. సౌందర్యతో కలిసి తెరపై నటించేటప్పుడు తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని, ఆమె తన నటనతో ఎప్పుడూ ప్రత్యేకంగా ఆకట్టుకునేవారని గుర్తుచేసుకున్నారు. సౌందర్యను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటారని, తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలు మరువలేనివని భావోద్వేగంగా చెప్పారు.
శ్రీకాంత్, సౌందర్య జోడీకి అప్పట్లో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా మంచి ఆదరణ పొందింది. తారకరాముడు, అనగనగా ఒక అమ్మాయి, కలిసి నడుద్దాం, నా మనసిస్తా రా, ప్రేమ ప్రయాణం, నిన్నే ప్రేమిస్తా వంటి పలు చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమాల్లో వారి జోడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ శ్రీకాంత్–సౌందర్య కాంబినేషన్‌ను తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటారు.
