
D News: Aug 10: అమరవీరుల కుటుంబాలకు అండగా తెలంగాణ పోలీస్ శాఖ
విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ‘టీజీ-వీర్’ (TG-Veer) పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ పోర్టల్‌ను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆదివారం అధికారికంగా ప్రారంభించారు.
అమరవీరుల కుటుంబాల సమస్యలకు ప్రత్యేక వేదిక
ఈ పోర్టల్ ద్వారా అమరవీరుల కుటుంబ సభ్యులు తమకు రావాల్సిన ఆర్థిక సాయం, కారుణ్య నియామకాలు, ఇళ్ల స్థలాల కేటాయింపు తదితర ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను నేరుగా నమోదు చేసుకోవచ్చు. అమరవీరుల సర్వీస్ రికార్డులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇప్పటికే అందిన ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం వంటి వివరాలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి.
అధికారుల నిరంతర పర్యవేక్షణ
టీజీ-వీర్ పోర్టల్‌లో నమోదయ్యే విజ్ఞప్తులను యూనిట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు. తద్వారా అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందే అవకాశం ఉంటుంది.
వరంగల్‌లో 28 మంది అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సమావేశం
జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్‌లో పర్యటించిన డీజీపీ సీవీ ఆనంద్.. మావోయిస్టుల హింసాత్మక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీసు కుటుంబాల సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డులను’ అందజేశారు.
క్యూఆర్ కోడ్‌తో TG-Veer పోర్టల్‌కు సులభంగా యాక్సెస్
ఫ్యామిలీ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అమరవీరుల కుటుంబ సభ్యులు నేరుగా టీజీ-వీర్ పోర్టల్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ సందర్భంగా ఎక్స్‌గ్రేషియా, పెన్షన్ తదితర అంశాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను కుటుంబ సభ్యులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ వారికి హామీ ఇచ్చారు.
నక్సల్స్ ఉద్యమ కాలాన్ని గుర్తుచేసుకున్న డీజీపీ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నక్సల్స్ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనే తాను తన వృత్తి జీవితాన్ని ప్రారంభించినట్లు డీజీపీ సీవీ ఆనంద్ గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో ఎంతోమంది పోలీసు సిబ్బంది చేసిన ప్రాణత్యాగాల ఫలితంగానే నేడు ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు స్థిరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
వరంగల్ కమిషనరేట్ భవన నిర్మాణ పనుల పరిశీలన
అనంతరం నిర్మాణంలో ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కార్యాలయ భవనాన్ని డీజీపీ సీవీ ఆనంద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన.. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా తగిన సూచనలు చేశారు.
