
D News: Aug 8: అసాధ్యం అనుకున్నదాన్ని సుసాధ్యం చేసిన యువకుడు.. కొండ ప్రాంతాల కోసం ఎగిరే వాహనం!
ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకున్నాడు.. అందరూ అసాధ్యం అని భావించిన ఆలోచనను సుసాధ్యం చేసి చూపించాడు ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా. తన గ్రామంలోని ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ రవాణా సమస్యకు పరిష్కారం చూపాలనే ఆలోచనతో గాల్లో ఎగిరే డ్రోన్ కారును రూపొందించాడు. ఎన్నో రోజుల కష్టంతో తయారు చేసిన ఈ వాహనాన్ని విజయవంతంగా పరీక్షించి తన ప్రయోగంలో సక్సెస్ సాధించాడు.
గాల్లో ఎగిరే వాహనాలు కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే సాధ్యమని చాలామంది భావిస్తారు. కానీ ఉత్తరాఖండ్‌లోని ఆల్మోరా జిల్లా కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తా మాత్రం ఆ ఆలోచనను సవాల్ చేశాడు. ‘ఇది ఎందుకు సాధ్యం కాదు?’ అనే ఆలోచనతో ప్రయోగాలు ప్రారంభించి, చివరకు ‘హపిదా స్కైనెక్స్’ పేరుతో సింగిల్-సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్‌ను తయారు చేశాడు. దీనిని విజయవంతంగా పరీక్షించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గ్రామీణ సమస్య నుంచే పుట్టిన ఆలోచన
రవి తమ్తా నివసించే ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో రవాణా సౌకర్యాలు అంతగా అందుబాటులో ఉండవు. గ్రామం నుంచి తన ఇంటికి చేరుకోవడానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని రవి తెలిపాడు. సాధారణ రహదారి మార్గంలో ఈ ప్రయాణానికి దాదాపు 90 నిమిషాల సమయం పడుతుందని, అదే వాయు మార్గంలో ప్రయాణిస్తే కేవలం 10 నిమిషాల్లోనే చేరుకోవచ్చని గుర్తించాడు.
ఈ ఆలోచనే రవిని ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ తయారీ వైపు నడిపించింది. వాహనాన్ని రూపొందించేందుకు పలురోజులు శ్రమించి, అనేక ప్రయోగాలు చేశాడు. చివరకు తన ఆలోచనకు రూపం ఇచ్చి ‘హపిదా స్కైనెక్స్’ను తయారు చేసి విజయవంతంగా టెస్ట్ డ్రైవ్ చేశాడు.
డ్రోన్ టెక్నాలజీతో సింగిల్ సీటర్ ఫ్లయింగ్ వెహికల్
రవి ఏర్పాటు చేసిన స్టార్టప్ ‘హపిదా స్కై ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ఈ వాహనాన్ని అభివృద్ధి చేశారు. ఒక వ్యక్తిని గాల్లో సురక్షితంగా తీసుకెళ్లేలా డ్రోన్ టెక్నాలజీని సవరించి, మరింత అభివృద్ధి చేసి ఈ ఫ్లయింగ్ వెహికల్‌ను రూపొందించినట్లు రవి తెలిపాడు.
కొన్నేళ్లుగా తాను చేసిన కృషికి ఈ విజయమే ఫలితమని రవి పేర్కొన్నాడు. తన జీవితంలో ఇది ఎంతో పెద్ద సాధన అని, ప్రయోగం విజయవంతం కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పాడు.
ప్రస్తుతం ప్రోటోటైప్ దశలోనే..
అయితే ‘హపిదా స్కైనెక్స్’ ప్రస్తుతం ప్రోటోటైప్ దశలోనే ఉందని రవి స్పష్టం చేశాడు. దీనిని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిపాడు. ప్రస్తుత టెస్ట్ డ్రైవ్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు తొలి అడుగు మాత్రమేనని వివరించాడు.
ఈ ఫ్లయింగ్ వెహికల్ భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో రవాణా సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగపడే అవకాశం ఉంది. అంతేకాకుండా నగరాల్లోనూ ఇలాంటి వాహనాల వినియోగం పెరిగితే రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కూడా దోహదపడే అవకాశం ఉందని రవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
