
D Spiritual: Jul 15: వరంగల్ ప్రజల ఇలవేల్పు దైవంగా కొలిచే శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు మొత్తం 14 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
ఉత్సవాల తొలి రోజు సహస్ర కలశాభిషేకం, గణపతి పూజ, పూర్వాంగ విధి కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
దేశంలో తొలి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యే ఆలయంగా వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమైన అనంతరమే దేశంలోని ఇతర ప్రాంతాల్లో శాకాంబరీ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక క్రమ పూజలు నిర్వహిస్తారు. జూలై 15న కామేశ్వరి క్రమం, 16న కపాలినీ, భగమాలినీ క్రమాలు, 17న కుల్లా, నిత్యక్లిన్నా క్రమాలు, 18న కురుకుల్లా, భేరుండా క్రమాలు, 19న విరోధినీ, వహ్నివాసినీ క్రమాలు, 20న విప్రచిత్తా, మహావజ్రేశ్వరీ క్రమాలు, 21న ఉగ్రా, శివదూతీ క్రమాలు, 22న ఉగ్రప్రభా, త్వరితా క్రమాలు, 23న దీప్తా, కులసుందరీ క్రమాలు, 24న నీలా, విజయా క్రమాలు, 25న ఘనా, నీలపతాకా క్రమాలు, 26న బలాకా, విచిత్రా క్రమాలు, 27న మాత్రా, సర్వమంగళా క్రమాలు, 28న ముద్రా, జ్వాలామాలినీ క్రమాలు నిర్వహించనున్నారు.
జూలై 29న ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మితా క్రమ పూజల అనంతరం అమ్మవారు ‘సంపూర్ణ శాకాంబరీ’ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజును ఉత్సవాల ప్రధాన ఘట్టంగా భావిస్తారు.
శాకాంబరీ ఉత్సవాల్లో అమ్మవారిని ప్రకృతిలో లభించే వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కరువు, కాటకాలు దరిచేరవని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, భద్రత తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
