
D Spiritual: Jul 14: తిరుమల: హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.4.41 కోట్ల విరాళాన్ని అందించింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ పొట్టి వేంకటేశ్వర్లు, డైరెక్టర్లు ఎస్. రాజమౌళి, టి. ప్రసాదరావు, పొట్టి మాలతి లక్ష్మీ కుమారి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.
అదేవిధంగా తిరుపతికి చెందిన శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ సింగపాటి సుబ్బారావు తన కుమారుడు సింగపాటి సాయికృష్ణ పేరుమీదుగా శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు.
ఇదిలా ఉండగా, మదురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ సోమవారం టీటీడీ ఎస్‌వీ గోశాలకు ఒక మగ గుర్రాన్ని విరాళంగా సమర్పించారు. ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.
దాత నుంచి గుర్రాన్ని టీటీడీ ఎస్‌వీ గోశాల డైరెక్టర్ ఏ.వి.ఎన్. శివకుమార్ స్వీకరించారు. తాజా విరాళంతో కలిపి ప్రస్తుతం ఎస్‌వీ గోశాలలో మొత్తం ఐదు గుర్రాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
