
D News: Jul 15: తిరుపతిలో మరో దారుణ ఘటన కలకలం రేపింది. నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న నేరాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల పెళ్లి మండపం వద్ద జంట హత్యలు చోటుచేసుకోగా, తాజాగా నగల కోసం 65 ఏళ్ల మహిళను దుండగులు హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, బైరాగిపట్టెడ ప్రాంతంలోని జయనగర్లో నివసిస్తున్న 65 ఏళ్ల జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. నగల కోసం ఆమెపై దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవిపోగులు దోచుకుని పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఘటనలో ఆమె వేలికి కూడా గాయాలు చేసినట్లు సమాచారం.
మృతురాలి భర్త రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. తన కుమారుడిని అమెరికాకు పంపేందుకు బెంగళూరుకు వెళ్లగా, జ్యోతి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ సమయంలోనే దుండగులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో భర్త బెంగళూరు నుంచి ఫోన్ చేయగా జ్యోతి మాట్లాడారు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో, ఇంటి పనిమనిషికి, పై అంతస్తులో అద్దెకు ఉంటున్న వారికి సమాచారం ఇచ్చి ఆరా తీశారు. వారు ఇంటికి వెళ్లి చూడగా, తాళం వేసి ఉన్న ఇంట్లో జ్యోతి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నగలు దోచుకున్న అనంతరం ఇంటికి తాళం వేసి దుండగులు పరారైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
