
D Spiritual: Mar 18: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది ఒక ప్రత్యేకమైన పండగ. ఈరోజు ఆనందోత్సాహాల మధ్య పండగను జరుపుకుంటారు. ఉగాదికి ప్రధాన ఆకర్షణ ఉగాది పచ్చడి. ఈ పచ్చడిని ఉగాది రోజున తీసుకోవడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సుఖాలు అన్నింటినీ సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని పండితులు తెలియజేస్తారు.
తెలుగు సంవత్సరాది అయిన ఉగాది ప్రకృతిలో కూడా మార్పులను తీసుకువస్తుంది. వసంత ఋతువు రాకతో ప్రకృతి పచ్చని అందాలతో కళకళలాడుతుంది. మామిడి చిగుర్లు, కోకిలల గానాలు, వేపపూల పరిమళాలతో తెలుగువారి ఇళ్లలో కొత్త సంవత్సర సంబరాలు మొదలవుతాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండుగతో తెలుగు నూతన సంవత్సరం ఘనంగా ఆరంభమవుతుంది. ఈ ఏడాది ఉగాది మార్చి 19న రేవతి నక్షత్ర ప్రవేశంతో జరగనుంది.
గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఆశలతో నిండిన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఉగాది ఒక శుభసందర్భం. రైతులు కూడా ఈ రోజున కొత్త సాగు పనులకు శ్రీకారం చుడతారు. అందుకే ఉగాదిని కొత్త ప్రారంభాలకు సంకేతంగా భావిస్తారు.
ఉగాది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే ఔషధం కూడా. పచ్చడిలోని ప్రతి రుచి మన జీవితంలోని విభిన్న అనుభవాలను సూచిస్తుంది. వేపపూత శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మామిడి ముక్కలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పచ్చడిని ఉగాది రోజు మాత్రమే కాకుండా శ్రీరామ నవమి లేదా చైత్ర పౌర్ణమి వరకు తీసుకోవడం వల్ల శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.
ఉగాది పచ్చడి స్వీకరించే సమయంలో ఒక శ్లోకం పఠించడం శుభప్రదంగా భావిస్తారు:
“శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్‌ప్రదాయినే
సర్వారిష్టవినాశాయ నింబకదళభక్షణం”
ఈ శ్లోకం అర్థం: వజ్రంలా దృఢమైన శరీరం, నూరేళ్ల ఆయుష్షు, సమస్త సంపదలు కలగాలని, అన్ని అపాయాలు, వ్యాధులు తొలగిపోవాలని కోరుకుంటూ ఈ పచ్చడిని భక్తితో స్వీకరిస్తున్నాను.
ఉగాది పచ్చడి తయారీ వెనుక లోతైన అర్థం ఉంది. సంవత్సరం మొత్తం ఎదురయ్యే కష్టాలు, సుఖాలను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందించడం ఇందులో ప్రధాన ఉద్దేశం. పచ్చడిని ముందుగా దేవుని వద్ద ఉంచి పూజించి, తరువాత కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తీసుకోవడం ఆనవాయితీ.
ఉగాది పచ్చడిలో షడ్రుచులు (ఆరు రుచులు) ఉంటాయి. తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, ఉప్పు కోసం ఉప్పు, కారం కోసం మిరియాలు లేదా మిర్చి, చేదు కోసం వేపపువ్వులు, వగరు కోసం కొత్త మామిడి ముక్కలు ఉపయోగిస్తారు. ఈ ఆరు రుచుల కలయికే ఉగాది పచ్చడికి ప్రత్యేకతను ఇస్తుంది.
