
DNews:09 Mar: గ్రామాల్లో తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద మాజీ సర్పంచ్లు అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన చేపట్టారు. గత ఐదేళ్ల పదవీ కాలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పులు తెచ్చి మరీ వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాల వంటి పనులు పూర్తి చేశామని, అయితే ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, అప్పుల పాలు కావడంతో కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొందని మాజీ సర్పంచ్లు వాపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత తమను విస్మరించిందని వారు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
