
D Spiritual: March 2: రేపు ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సాయంత్రం 6.48 గంటలకు ముగియనుంది. ఇందులో ముఖ్యంగా సాయంత్రం 4.34 నుంచి 5.33 గంటల వరకు ‘సంపూర్ణ గ్రహణ కాలం’గా పరిగణించబడుతుంది. భారత్లో ఈ గ్రహణం సాయంత్రం 6.20 గంటల నుంచి సుమారు 27 నిమిషాల పాటు కనిపించనుంది. అండమాన్ దీవులు మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయించి, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. మళ్లీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం భారత్లో 2028 డిసెంబర్ 31న మాత్రమే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
గ్రహణ ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు రేపు మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో గ్రహణ సమయానికి ముందుగానే, ఉదయం 9 గంటలకే దర్శనాలను నిలిపివేసి, రాత్రి 7.30 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవనున్నారు. అలాగే తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉదయం 7 గంటలకే మూసివేసి, బుధవారం నాడు తిరిగి తెరుస్తామని ఆలయ అధికారులు ప్రకటించారు. గ్రహణం కారణంగా రేపు జరగాల్సిన హోలికోత్సవం (కామదహనం) కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే నిర్వహించాలని యాదగిరిగుట్ట ఆలయ యాజమాన్యం నిర్ణయించింది.
అయితే సాధారణంగా గ్రహణ కాలంలో అన్ని ఆలయాలు మూసివేసినప్పటికీ, చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ రాహు-కేతు క్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయం మాత్రం రేపు తెరిచే ఉంటుంది. ఇక్కడ గ్రహణ సమయంలో స్వామివారికి మరియు అమ్మవారికి ప్రత్యేకమైన ‘గ్రహణ కాల అభిషేకాలు’ నిర్వహిస్తారు. ఈ క్షేత్రంపై గ్రహణ ప్రభావం ఉండదని, పైగా గ్రహణ సమయంలో పూజలు చేయడం అత్యంత ఫలప్రదమని భక్తుల నమ్మకం. ఇతర ఆలయాల్లో మాత్రం గ్రహణం ముగిసిన తర్వాత సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనాన్ని అనుమతిస్తారు.
