D Spiritual: Jan 30: మేడారం వనదేవతల జనప్రవేశం పూర్తి

లక్షలాది మంది భక్తజనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మేడారం వనదేవతల జనప్రవేశం పూర్తయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, చిలుకలగుట్ట నుంచి సమ్మక్క దేవతలు గద్దెలపై ప్రతిష్టాపన కావడంతో భక్త జనకోటికి దర్శనమిస్తున్నారు. మహిమాన్వితురాలైన సమ్మక్క తల్లి రాకతో మేడారం ప్రాంగణం పులకించిపోయింది. శక్తిపీఠంగా మారిన గద్దెల మహాప్రాంగణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

మేడారం పరిసరాలన్నీ సమ్మక్క–సారలమ్మ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ రోజు శుక్రవారం (జనవరి 30) తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో పాటు పలువురు ప్రముఖులు తల్లుల దర్శనానికి రానున్నారు.

సమ్మక్క తల్లి ఘనాగమనం

భక్తిభావంతో ఎదురుచూసిన అద్భుత దృశ్యం మేడారంలో ఆవిష్కృతమైంది. మూలదేవత సమ్మక్క గద్దెలపైకి చేరుకున్నారు. పూజారులు చిలుకలగుట్ట నుంచి అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో గద్దెలకు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ దివాకర అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ సుదీర్ రామ్‌నాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారిని స్వాగతించారు.

మహాజాతర రెండో రోజు ప్రధాన ఘట్టం

మహాజాతర తొలి రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా, రెండో రోజు గురువారం ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి, ముందుగా సమ్మక్క గద్దెపై వన ప్రతిష్ట చేశారు. అనంతరం చిలుకలగుట్టలో రహస్య పూజలు కొనసాగాయి. సాయంత్రం 6:43 నిమిషాలకు కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను పూజారులు కిందకు తీసుకురాగా, ఎస్పీ రామ్‌నాథ్ కేకన్ AK-47 గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు.

భక్తులతో కిక్కిరిసిన చిలుకలగుట్ట మార్గాలు

సమ్మక్క తల్లి వనం నుంచి జనంలోకి వస్తుండడంతో చిలుకలగుట్ట రహదారులు భక్తులతో నిండిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు రంగవల్లులు, ఎదుర్కోళ్ళు, జంతు బలులతో అమ్మవారికి స్వాగతం పలికారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ‘జై సమ్మక్క తల్లి’ నినాదాలతో మేడారం మార్మోగిపోయింది. శివసత్తుల పూనకాలు, భక్తుల నృత్యాల మధ్య అమ్మవారి ఆగమనం దిగ్విజయంగా సాగింది. ఆదివాసీ గిరిజన సంఘాలు, తుడుందెబ్బ, ప్రత్యేక పోలీసు బలగాలతో నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు.

గద్దెలపై సమ్మక్క ప్రతిష్ట

రాత్రి 9:30 నిమిషాలకు సమ్మక్క తల్లి గద్దెల ప్రాంగణానికి చేరుకోగా, విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. 9:34 నిమిషాలకు పూజారులు అమ్మవారిని గద్దెపైకి చేర్చగా, 9:54 వరకు రహస్య పూజలు నిర్వహించి ప్రతిష్టాపన పూర్తిచేశారు. అనంతరం దేవాదాయ శాఖ తొలి మొక్కులు సమర్పించింది. మంత్రి సీతక్కతో పాటు ఉన్నతాధికారులు అమ్మవారికి చీరె, సారె, పసుపు, కుంకుమలు, గాజులు సమర్పించారు. రాత్రి 10:04 నిమిషాల నుంచి భక్తులకు దర్శనం ప్రారంభమైంది.

భారీగా పోటెత్తిన భక్తజనం

నలుగురు దేవతలు గద్దెలపై కొలువుదీరడంతో అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగు నుంచి క్యూ లైన్ల వరకు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ రోజు, రేపు దేవతలు గద్దెలపైనే ఉంటారని, రేపు సాయంత్రం వనప్రవేశంతో జాతర ముగియనుందని అధికారులు తెలిపారు.

లక్షల సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకోవడంతో గ్రామం విశ్వనగరాన్ని తలపిస్తోంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి తల్లుల వద్ద మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపిస్తోంది. వనదేవతలు గద్దెలపై చేరడంతో మేడారం పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. భక్తిభావం ఉప్పొంగి, గద్దెల మహాప్రాంగణం శక్తిపీఠంగా మారి భక్తులకు దీవెనలు అందిస్తోంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana