
D Spiritual: Dec 26: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. జనవరి 6 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, తిరుమలతో పాటు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి పరిసర ప్రాంతాల స్థానిక భక్తులకు ప్రత్యేక కోటా కింద దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. జనవరి 6, 7, 8 తేదీల్లో జరిగే దర్శనాలకు రోజుకు 5 వేల టోకెన్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
స్థానిక భక్తులకు కేటాయించిన ఈ ప్రత్యేక కోటా టోకెన్ల కోసం ఆసక్తి ఉన్నవారు ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ సూచించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా 1+3 విధానంలో నమోదు చేసుకునే సౌకర్యం కల్పించినట్లు తెలిపింది.
టోకెన్ల కేటాయింపులో భాగంగా తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల భక్తులకు రోజుకు 4,500 టోకెన్లు, తిరుమలలో నివసించే స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించనున్నారు. నమోదు ప్రక్రియ పూర్తైన అనంతరం ‘ఈ-డిప్’ పద్ధతిలో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
లక్కీ డ్రా ద్వారా ఎంపికైన భక్తుల వివరాలను ఈ నెల 29న మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. అర్హత కలిగిన స్థానిక భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదే సమయంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో నిర్వహించనున్న ముఖ్య ఉత్సవాల షెడ్యూల్ను కూడా టీటీడీ ప్రకటించింది. జనవరి 3న పౌర్ణమి గరుడ సేవ, 14న భోగి తేరు, 16న గోదాదేవి కల్యాణం, 17న పార్వేట ఉత్సవం, 25న రథసప్తమి నిర్వహించనున్నారు. అలాగే జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు తెప్పోత్సవాలు ఘనంగా జరుగనున్నట్లు వెల్లడించారు.
