
DNews:11 Dec: ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇద్దరు IAS అధికారులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సమాచారం అందించనందుకు మాజీ జీహెచ్ఎంసీ కమిషనర్ కె. ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్ ఆర్.వి. కర్ణన్లకు హైకోర్టు నోటీసులు పంపింది.సికింద్రాబాద్ రాంగోపాల్పేటకు చెందిన వడ్డం శ్యామ్ ఆర్టీఐ చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని అధికారులు ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు గత నెల నవంబర్ 24న సమాచారం తక్షణమే ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో శ్యామ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.
ఈరోజు (గురువారం) విచారణలో ధర్మాసనం, అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలంటూ IAS అధికారులకు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది.కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరించేలా జనవరి 26న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అదనంగా, ఇకముందు కోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా ఉంటే జరిమానా విధిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.ఈ విచారణ, ప్రభుత్వ అధికారుల బాధ్యతారాహిత్యంపై హైకోర్టు తీసుకున్న కఠిన వైఖరికి నిదర్శనంగా నిలిచింది.
