
D Spiritual: Dec 3: లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ । పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ ।।
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప।।
అయ్యప్ప దీక్ష నియమాలు| సకల చరాచర విశ్వంలో భగవంతుడు సృష్టించిన వాటిలో అత్యున్నతమైనది మానవ జన్మ. అన్ని జీవరాశుల్లోకెల్లా బుద్ధికుశలత ఉన్న జీవి మనిషి. ప్రకృతితో పాటు సకల పశుపక్ష్యాదులను రక్షించాల్సిన బాధ్యత మనిషిపై ఉంది.
పవిత్రమైన మనిషి జన్మను భగవంతుడు ప్రసాదించినప్పుడు ఆ అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. నీతి, నిజాయతీ, కట్టుబాట్లు పాటిస్తూ మనిషి కనీస ధర్మాలను ఆచరించాలి. నిత్యం భగవన్నామ స్మరణ చేస్తూ సృష్టి, స్థితి, లయ కారకుణ్ని ఆరాధించాలి.
మాధవ సేవతో పాటు మానవ సేవతో మోక్షాన్ని పొందాలి. అలాంటి అత్యుత్తమమైన మార్గాన్ని అనుసరింపజేసే ఆధ్యాత్మిక భావన అయ్యప్ప మాల. అయ్యప్ప కథ ప్రగాఢమైన భక్తి, ధైర్యం మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణతో కూడినది. ఇది తరతరాలుగా సంక్రమించిన కథ.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను ధర్మం మరియు స్వీయ నియంత్రణ మార్గంలో నడిపించినది అయ్యప్ప చరిత్ర. ధర్మ రక్షకుడిగా పిలువబడే అయ్యప్ప, శివుడు మరియు విష్ణువు యొక్క స్త్రీరూపమైన మోహిని కుమారుడు. స్వామి పుట్టుక, జీవితం, లక్ష్యం మంచి–చెడుల మధ్య శాశ్వత పోరాటానికి ప్రతీక.
అయ్యప్ప యొక్క అంతిమ లక్ష్యం ఆధ్యాత్మిక విముక్తి సాధనలో అన్ని విశ్వాసాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం. హరిహరపుత్రుడి కథ ద్వారా భక్తి, త్యాగం, ఐక్యత యొక్క శక్తిని మనం గ్రహిస్తాం. అయ్యప్ప మాలకు సంబంధించిన అత్యంత పవిత్ర ఆచారాలలో అయ్యప్ప మహా పడి పూజ ఒకటి.
ఈ ఆధ్యాత్మిక వేడుకలో శబరిమల మందిరంలో అయ్యప్పను చేరుకోవడానికి భక్తులు ఎక్కే 18 మెట్లు లేదా పడి వేడుకగా పరిగణిస్తారు. 18 మెట్లు సత్యం, జ్ఞానం, భక్తి వంటి వివిధ ఆధ్యాత్మిక సూత్రాలను సూచిస్తాయి. వాటిని అధిరోహించడం జ్ఞానోదయ దిశగా భక్తుని పురోగతికి సంకేతం.
యాత్రికుల ప్రయాణం ముగింపుకు గుర్తుగా ఈ పవిత్ర దశలను గౌరవించేందుకు మహా పడి పూజ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్ష కాలం ఆసన్నమైంది. ఇప్పటికే చాలా మంది మాల ధరించి అయ్యప్ప దీక్షను పాటిస్తున్నారు.
అయ్యప్ప దీక్ష అత్యంత పవిత్రమైనది మరియు కఠినమైనది. కేరళలోని శబరిమలలో అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు 41 రోజుల మండల దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకుంటారు. మాలధారణ చేసిన స్వాములు ఈ 41 రోజులలో అత్యంత నియమ నిష్టలతో అయ్యప్పనుఆరాధిస్తారు.
దీక్ష ప్రారంభానికి కార్తీక మాసం శుక్ల పాడ్యమి నాడు నిర్ణయించి, కనీసం 41 రోజులు పూర్తయ్యేలా గురుస్వామి సాన్నిధ్యంలో 108 పూసలు గల తులసి లేదా రుద్రాక్ష మాలను ధరించాలి. మాల ధరించే ముందు కనీసం మూడు రోజుల పాటు పవిత్రంగా ఉండాలి; మద్యం, మాంసం తినరాదు.
దీక్ష సమయంలో అల్లం, వెల్లుల్లి లేని పూర్తి సాత్వికాహారం ఆరగించాలి. మధ్యాహ్నం 3 గంటలలోపు భిక్ష పూర్తి చేయాలి. సాయంత్రం పూజ అనంతరం అల్పాహారం తీసుకోవాలి. గురుస్వామి సూచించిన నియమాలను విధేయతతో పాటించాలి.
ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం చేసి, సూర్యోదయం కాకముందే పూజను ముగించాలి. సాయంత్రం కూడా చన్నీటి స్నానం చేసి సంధ్యాపూజ చేయాలి. స్నానం తర్వాత విభూతి, చందనం, కుంకుమ ధరించాలి. గణపతి, షణ్ముఖుడు, కులదైవ పూజ అనంతరం 108 సార్లు “ఓం స్వామియే శరణం అయ్యప్ప” శరణుఘోష పలకాలి.
దీక్షాకాలంలో నలుపు, నీలం, కాషాయం రంగు దుస్తులు ధరించాలి. ప్రతి రోజూ ఒక్కసారి అయినా అయ్యప్ప గుడి లేదా ఇతర దేవాలయానికి వెళ్లాలి. చెప్పులు ధరించకూడదు. ధూమపానం, మద్యపానం, మత్తు పదార్థాలు, తాంబూలం నిషిద్ధం. జుట్టు, గడ్డం, గోర్లు కత్తిరించకూడదు.
పగటిపూట నిద్రించకూడదు. రాత్రి మంచంపై నిద్రించకూడదు. చాప లేదా తుండుగుడ్డ పరుచుకుని పడుకోవాలి. తలదిండు ఉపయోగించకూడదు. నిద్రించే సమయంలో మాల నేలకు తాకకుండా జాగ్రత్తపడాలి.
నిరంతరం భజనల్లో పాల్గొనాలి. హోదా, వయస్సు, ధనం–పేదతనం తేడా లేకుండా అన్ని అయ్యప్ప స్వాములకు పాదాభివందనం చేయాలి. తల్లిదండ్రులు తప్ప మిగిలిన వారికి పాదాభివందనం చేయకూడదు.
దీక్షలో పూజలు, భిక్ష, నిద్ర—అన్నీ ప్రకృతికి అనుగుణంగా ఉండాలి. పూజ సమయంలో తడి దుస్తులు వద్దు. చొక్కా ధరించకూడదు. అంగవస్త్రం మాత్రమే చుట్టుకోవాలి. అశుభకార్యాల్లో పాల్గొనరాదు. అత్యవసరం అయితే తప్ప దూర ప్రయాణాలు చేయరాదు.
దీక్షలో ఉన్నప్పుడు బంధువుల మరణం జరిగితే మాల విసర్జన చేయాలి. భిక్ష ఎవరు శుభ్రంగా సిద్ధం చేసి పెట్టినా స్వీకరించవచ్చు. అయ్యప్ప అన్నదానప్రియుడు కాబట్టి కనీసం ముగ్గురికైనా భిక్ష పెట్టడం ఉత్తమం. వీలైతే మూడుసార్లు ఇతరుల ఇంటికి భిక్షకు వెళ్లాలి.
దీక్ష కాలంలో బ్రహ్మచర్యం కఠినంగా పాటించాలి. స్త్రీలను కామప్రవృత్తితో చూడరాదు. వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. సినిమాలు, నాటకాలు చూడరాదు.
పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు, రుతుకాలం ముగిసిన (సుమారు 50 ఏళ్లు పైబడిన) స్త్రీలు మాత్రమే మాల ధరించాలి. శబరిగిరి యాత్రకు వెళ్లేటప్పుడు “పోయి వస్తాను” అనకుండా “స్వామి శరణం” అనాలి.
పంబా నదిలో స్నానం చేస్తూ కుటుంబ పెద్దల పేర్లు స్మరించి వారి ఆత్మలకు శాంతి కోరుకోవాలి. యాత్రలో రెండు పూటలా స్నానం చేసి స్వామివారి పటాలకు, ఇరుముడికి హారతి ఇవ్వాలి. శరణుఘోష పలకాలి.
యాత్ర ముగించుకుని ఇంటికొచ్చిన తర్వాత అభిషేక ప్రసాదంతో సన్నిధానం కదిలించి, గురుస్వామి లేదా కన్నతల్లితో మాల విసర్జన మంత్రం చెప్పించి దీక్షను ముగించాలి.
