
D Spiritual: Dec 3: హిందూ మతంలో ఆధ్యాత్మిక యాత్రల ప్రాముఖ్యత అపారం. ప్రతి హిందువూ జీవితంలో ఎప్పుడో ఒకసారి తీర్థయాత్ర చేయాలని ఆసక్తి చూపిస్తారు. పురాతన కాలం నుంచే భక్తులు తమకు ఇష్టమైన దేవుడిని దర్శించుకునేందుకు కొండలు, కోనలు ఎక్కి పుణ్యక్షేత్రాలను చేరుకునే ఆచారం కొనసాగుతోంది. ఈ సంప్రదాయమే నేటికీ ట్రెక్కింగ్ రూపంలో కొనసాగుతుంది. అయితే హిందూ మతంలో ఈ తీర్థయాత్రలకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది? వాటి ప్రత్యేకత ఏమిటి?
ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పాదయాత్ర ఉదాహరణ అనంత్ అంబానీదే. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, గుజరాత్‌లోని జామ్‌నగర్ మోతీ ఖవ్డి నుంచి ద్వారక వరకు పాదయాత్ర చేస్తున్నాడు. రోజూ దాదాపు 10–12 కిలోమీటర్లు నడుస్తూ, మొత్తం 140 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనున్నాడు. ఈ ప్రయాణంలో దేవుని నామస్మరణ, కీర్తనలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హిందూ మతంలో ఇలాంటి పాదయాత్రల సంప్రదాయం చాలా పురాతనమైనది. అయితే ఇవి ఎందుకు చేస్తారు? వాటి ప్రాముఖ్యత ఏమిటి?
తీర్థయాత్రకు ఉన్న మతపరమైన ప్రాముఖ్యత చాలా గొప్పది. హిందూ విశ్వాసాల ప్రకారం పవిత్ర స్థలాలను పాదయాత్రగా చేరుకోవడం ద్వారా మనసు, ఆత్మ శుద్ధి అవుతాయని చెబుతారు. ఇది మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా, దేవుని ఆశీర్వాదాలను పొందే మార్గంగా భావిస్తారు. హిందూ గ్రంథాలలో కొండలు, అరణ్యాలు దాటి శివ, విష్ణు, అమ్మవారి క్షేత్రాలను చేరుకునే వారికి మోక్షం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. అదనంగా, నడక శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
పాదయాత్రకు జ్యోతిషశాస్త్రంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది. జ్యోతిష్య ప్రకారం మతపరమైన తీర్థయాత్రలు గ్రహదోషాలను తొలగిస్తాయని నమ్మకం. ప్రత్యేకంగా శని దోషం, ఏలి నాటి శని ప్రభావం ఆధ్యాత్మిక యాత్రల ద్వారా తగ్గుతుందని చెబుతారు. రాహు–కేతు ప్రతికూల దృష్టిలో ఉన్నవారికి కూడా తీర్థయాత్ర ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు. అదేవిధంగా పాదయాత్ర సమయంలో దేవుని మంత్రాలను జపిస్తే జాతకంలో శుభగ్రహాల అనుగ్రహం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది.
