
DNews:20 Nov:వినాయక నగర్, నిజామాబాద్ జిల్లాలో కల్తీకల్లు తయారీలో మత్తుమందు అల్ర్ఫాజోలం (Alprazolam) వినియోగం అధికమవుతున్న నేపథ్యంలో, నార్కోటిక్స్ విభాగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లాలోని పలు మండలాల్లో కొంతమంది కల్లు డిపోల్లో అల్ర్ఫాజోలం కలిపి కల్తీకల్లు తయారు చేస్తున్నారన్న సమాచారం అధికారులు సేకరించారు. దీంతో దాడులను ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో గురువారం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్ర్ఫాజోలం రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో నార్కోటిక్ ఇన్‌స్పెక్టర్ పూర్ణేశ్వర్, రూరల్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ సిబ్బందితో కలిసి గంగాస్థాన్ ప్రాంతంలో కారును ఆపి తనిఖీ చేశారు.
తనిఖీల్లో రూ.1.5 లక్షల విలువచేసే 150 గ్రాముల అల్ర్ఫాజోలం పట్టుబడింది. ఈ మత్తుమందును నిజామాబాద్ నుంచి మోపాల్ మండలంలోని మొదక్ పల్లికి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.అదుపులోకి తీసుకున్నవారు: రాజా గౌడ్ (మొదక్ పల్లి), శ్రీనివాస్ గౌడ్, సుజీత్ గౌడ్ పోలీసులు కారును సీజ్ చేసి, ముగ్గురిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
