
DNews:20 Nov:బాలానగర్, ప్రభుత్వ నిధులను కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తూ, నాసిరకం రోడ్ల నిర్మాణాలు చేపడుతున్న తీరు జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలో బయటపడింది. నాలుగు కాలాలు పదిలంగా ఉండాల్సిన రోడ్డు కనీసం పదిరోజులు కూడా నిలవకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జడ్చర్ల నియోజకవర్గం, బాలానగర్ మండలం బోడగుట్ట తండా గ్రామం నుంచి పెద్దరేవల్లి మీదుగా దేవునిగుట్ట తండా వరకు కిలోమీటర్ మేర ఆర్ అండ్ బీ (R&B) అధికారులు బీటీ రోడ్డు (BT Road) నిర్మాణాన్ని చేపట్టారు. అయితే, ఈ కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ కనీస నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన పనులు చేయకుండా, కేవలం మట్టిపైనే డాంబర్ వేసి చేతులు దులుపుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ నాసిరకం నిర్మాణం కారణంగా రోడ్డు వేసిన అనతికాలంలోనే మరమ్మతులకు గురవుతుండటంతో, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల దోపిడీ కారణంగానే రోడ్ల నిర్మాణాలు నాణ్యత కోల్పోతున్నాయని విమర్శించారు.స్థానిక ప్రజలు స్పందిస్తూ, తక్షణమే ఈ నాసిరకం రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడాలని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.
