
DNews:13 NOV:హైదరాబాద్ నగరంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను మెహిదీపట్నం పోలీసులు మరోసారి పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులు రమేష్ మరియు అతని సోదరి రామేశ్వరిగా పోలీసులు గుర్తించారు. తాండూర్ నివాసితులైన వీరు గతంలో కూడా నకిలీ కరెన్సీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్) వేదికగా నకిలీ నోట్ల వ్యాపారాన్ని విస్తరించిన రమేష్, తక్కువ ధరకే ఫేక్ కరెన్సీ అందిస్తామంటూ ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకర్షించాడు. ఈ ప్రకటనలు చూసిన పలువురు వ్యక్తులు 1:4 రేషియోలో (₹100 సాధారణ కరెన్సీ ఇస్తే ₹400 నకిలీ కరెన్సీ) ఒప్పందం కుదుర్చుకుని డబ్బులు పంపారు.
నకిలీ నోట్ల తయారీ విధానం మరింత షాకింగ్‌గా ఉంది: నిందితుడు రమేష్ ఒరిజినల్ నోటును కలర్ జిరాక్స్ తీసి, ఫోటోషాప్ సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ చేసి, గ్రీన్ కలర్ గిఫ్ట్ పేపర్‌పై సరైన సైజులో ప్రింట్ తీసుకునేవాడు. ఆ తర్వాత వాటిని ఫెవికాల్‌తో అతికించి, అసలు నోట్ల మాదిరిగా కనిపించేలా తయారు చేసేవాడు. ఈ విధంగా తయారైన నోట్లను ముఠా సభ్యులు నగరంలోని పలు ప్రాంతాల్లో చలామణి చేశారు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న మెహిదీపట్నం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాలను సేకరించి రమేష్ సహా మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4.75 లక్షల విలువైన నకిలీ కరెన్సీతో పాటు 9 సెల్‌ఫోన్లు, ఇతర ప్రింటింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా నకిలీ నోట్లను చలామణి చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో రమేష్ మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. ముఠాలోని ఇతర సభ్యులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
