
DNews:27 Nov:తెలంగాణలో 2015-16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షా ఫలితాలకు సంబంధించి హైకోర్టులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరీక్ష ద్వారా నియామకమైన 439 పోస్టుల ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని ధర్మాసనం ఊరటనిచ్చింది.పదేళ్ల కిందట, 2015-16లో 439 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ (TGPSC) గ్రూప్-2 పరీక్షను నిర్వహించింది.నవంబర్ 2016లో రాత పరీక్షలు జరిగాయి.కొందరు అభ్యర్థులు పరీక్ష సమయంలో వైట్నర్ను ఉపయోగించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ, టీజీపీఎస్సీ వెనక్కి తగ్గకుండా 2019లో నియామకాలను చేపట్టింది.
ఈ నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి నగేష్ భీమపాక నేతృత్వంలోని సింగిల్ బెంచ్, ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. పరీక్షల సమయంలో హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని, ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసినా మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది.సింగిల్ బెంచ్ ఈ పరీక్షను రద్దు చేస్తూ, సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం తిరిగి మూల్యాంకనం చేయాలని, ఎనిమిది వారాల్లోగా పునః మూల్యాంకనం చేసి, మళ్లీ అర్హుల తుది జాబితాను ప్రకటించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది.
సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభావితమైన పలువురు అభ్యర్థులు సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించారు.ఇరువర్గాల వాదనలు విన్న సీజే ధర్మాసనం, గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నియామకమైన ర్యాంకర్లకు తాత్కాలికంగా ఊరట లభించింది.
