
DSports:Sep19:మందమర్రి : మందమర్రి పట్టణానికి చెందిన యోగా సాధకుడు మద్ది శంకర్ ఒక గంటలో 180 సెట్ల (2160) సూర్య నమస్కారాలు చేసి రికార్డు నెలకొల్పారు. ఈ అద్భుతమైన ఘనతను ఇంటర్నేషనల్ యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ కౌన్సిల్ గుర్తించింది.
మంథని పట్టణానికి చెందిన యోగా గురువు, మద్ది శంకర్ ఉగాది పర్వదినం నుంచి ప్రతిరోజు 108 సూర్య నమస్కారాలు క్రమం తప్పకుండా చేస్తూ వస్తున్నారు. యోగా పట్ల తనకున్న అంకితభావాన్ని, అకుంఠిత దీక్షను చాటుకోవాలని సంకల్పించుకున్న ఆయన, ఈ క్రమంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు సాధించాలని నిర్ణయించుకున్నారు.
ఆ నిర్ణయంలో భాగంగా, గురువారం మందమర్రిలో ఇంటర్నేషనల్ యోగా బుక్ ఆఫ్ రికార్డ్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఒక గంటలో 180 సెట్ల సూర్య నమస్కారాలు పూర్తి చేసి రికార్డు సాధించారు. ఈ ఘనతను అంతర్జాతీయ యోగా రికార్డ్స్‌లో నమోదు చేశారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తహశీల్దార్ సతీష్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కోశాధికారి కనపర్తి రమేష్, హిందూ ఉత్సవ సమితి నాయకులు అనంతచార్యులు, ఏఈఈ పోషం తదితరులు పర్యవేక్షించారు.
మద్ది శంకర్ రికార్డు సాధించిన అనంతరం, పలువురు యోగా సాధకులు, క్రీడా ప్రముఖులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆయనను సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మద్ది శంకర్ మాట్లాడుతూ, ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. భవిష్యత్తులో కూడా యోగా ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడానికి కృషి చేస్తానని చెప్పారు.
