
DNews:09 Mar: విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న ‘విజయా డెయిరీ’ బ్రాండ్ పేరుతో మార్కెట్లో కల్తీ నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలు ఇవ్వడమే ఈ అక్రమాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మేఘనా ఫుడ్స్ అనే సంస్థకు ఫ్రాంచైజీ ఇవ్వగా, వారు గుజరాత్‌లోని కన్హాన్ డెయిరీ నుంచి నెయ్యిని సేకరించి విజయ బ్రాండ్ పేరుతో తెలంగాణలో విక్రయిస్తున్నారని వివరించారు. ఈ నెయ్యిని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) ల్యాబ్‌లో పరీక్షించగా, అందులో వెజిటబుల్ ఆయిల్ మరియు హానికరమైన రసాయనాలు కలిసినట్లు నిర్ధారణ అయిందని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ మార్కెట్లోనే ప్రతి నెలా సుమారు 100 టన్నుల కల్తీ నెయ్యి అమ్ముడవుతోందని, ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమేనని అమిత్ రెడ్డి మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ బ్రాండ్‌ను ప్రైవేట్ శక్తులకు అప్పగించిందని, దీనివల్ల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు రావాల్సిన ఆదాయం గండిపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ నుంచి వచ్చే పాల ప్యాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీల వివరాలు వస్తున్నాయని, ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని, తక్షణమే సదరు ప్రైవేట్ ఫ్రాంచైజీలను రద్దు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
