
DNews:24 Jan: నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. శుక్రవారం అర్ధరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ సిబ్బందిపైకి కారు దూకించి బీభత్సం సృష్టించారు. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. స్మగ్లర్ల కారు బలంగా ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలవ్వగా, వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన అనంతరం నిందితులు కారుతో పారిపోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు సినిమా ఫక్కీలో వెంబడించి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు కిలోల ఎండు గంజాయిని మరియు రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఇద్దరు స్మగ్లర్లను నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వెనుక ఉన్న గంజాయి నెట్వర్క్ గురించి విచారణ జరుపుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై ఇలాంటి దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది.
