
DNews:02 Dec:పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం. 282 తీసుకువచ్చి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల పని గంటలను పెంచినప్పుడు, అందుకు అనుగుణంగా జీతాలను కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఐటీయూ (CITU) పెద్దపల్లి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఏ. ముత్యంరావు డిమాండ్ చేశారు.రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల ఉసురు పోసుకుంటుందని ఆరోపించారు.
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ. 26,000 చెల్లించాలి.ప్రభుత్వం జీవో నం. 282 ద్వారా 10 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తుందని ఆరోపించారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేస్తుందని, ఈ కపట నాటకాలను ఎండగట్టడానికి పోరాటాలే మార్గమని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులచే సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు రమణ, సమ్మక్క, రామలక్ష్మి, రవీందర్, సారయ్య, శోభన్, సాగర్, సంతోష్, ప్రతాప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
