
ఆసియా గేమ్స్ 2026లో టైటిల్ డిఫెండ్ చేసేందుకు బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొడుతోంది. క్వార్టర్‌ఫైనల్‌లో ఆతిథ్య జపాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయి శ్రీ చరణి స్పిన్ మాయాజాలంతో జపాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. ఫలితంగా జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది.
నాలుగు ఓవర్లు వేసిన శ్రీ చరణి కేవలం 10 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆమెకు షఫాలీ వర్మ, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ నుంచి మంచి సహకారం లభించింది. శ్రేయాంక పాటిల్ చివరి వికెట్‌ను తీసుకోవడంతో జపాన్ ఇన్నింగ్స్ ముగిసింది.
మ్యాచ్ ఆరంభంలో జపాన్ బ్యాటర్లు భారత బౌలర్లను కొంతవరకు సమర్థంగా ఎదుర్కొన్నారు. పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. అయితే భారత స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చరణి వరుస వికెట్లు తీయడంతో జపాన్ బ్యాటింగ్ లయ తప్పింది.
భారత పేసర్లు క్రాంతి గౌడ్, నందిని శర్మ వికెట్లు తీయకపోయినా పరుగులను కట్టడి చేశారు. మరోవైపు చరణి, దీప్తి, శ్రేయాంక, షఫాలీ స్పిన్ ధాటికి జపాన్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు.
జపాన్ బ్యాటర్లలో అయకా కటో 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. హరున ఇవాసాకి 10 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. పలువురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు.
చివర్లో నొనోహా యసుమోటోను శ్రేయాంక పాటిల్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో జపాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ముందు 58 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే నిలిచింది.
ఇటీవల ముగిసిన మహిళల ఆసియా కప్‌లోనూ శ్రీ చరణి కీలకంగా రాణించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్లు తీసి భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.
