పుదుచ్చేరిలో జరుగుతున్న సౌత్ జోన్ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’కు చెందిన క్రీడాకారులు పలు విభాగాల్లో పతకాలు సాధించారు.

తెలంగాణకు చెందిన అభినయ్ నాయక్ డెకాథ్లాన్‌లో 5,842 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇక 110 మీటర్ల హర్డిల్స్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తనీష్ తేజ 14.17 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకం సాధించాడు. షాట్‌పుట్‌లో ఏపీకి చెందిన నిత్య హాసిని 11.12 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది.

పురుషుల షాట్‌పుట్‌లో తెలంగాణకు చెందిన సునీత్ కుమార్ 15.52 మీటర్ల ప్రదర్శనతో కాంస్యం గెలుచుకోగా.. మహిళల విభాగంలో ఏపీకి చెందిన ఎండీ అసియా 11.91 మీటర్లతో కాంస్య పతకం సాధించింది.

మెడ్లీ రిలేలో తెలంగాణకు చెందిన ప్రశంస 2:18.00 నిమిషాల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. 4×100 మీటర్ల రిలేలో ఏపీకి చెందిన పుష్యమి నాగసాయి, సూరి ప్రిస్కిల్ల కాంస్య పతకాలు సాధించారు.

ఇక 1000 మీటర్ల పరుగులో తెలంగాణ అథ్లెట్ శివాని 3:05.99 నిమిషాల టైమింగ్‌తో కాంస్య పతకాన్ని అందుకుంది. దీంతో సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఏపీ యువ అథ్లెట్లు పలు విభాగాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు.