
ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నిషినోలో శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్‌ఫైనల్‌లో జపాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత భారత బౌలర్లు విజృంభించడంతో జపాన్ 57 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆ తర్వాత షఫాలీ వర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ కేవలం 5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగానే భారత బౌలర్లు జపాన్ బ్యాటర్లపై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా తెలుగు స్పిన్నర్ శ్రీ చరణి మరోసారి సత్తా చాటింది. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టింది. షఫాలీ వర్మ రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో వికెట్ సాధించారు.
జపాన్ బ్యాటర్లలో అయాకా కాటో-స్టాఫోర్డ్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. హరునా ఇవాసకి 10 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయారు. దీంతో జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకు కుప్పకూలింది.
58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గునాలన్ కమలిని రెండు బంతుల్లోనే డకౌట్ కాగా.. భారతి ఫుల్మాలి 6 పరుగులకే వెనుదిరిగింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన షఫాలీ వర్మ మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది.
షఫాలీ కేవలం 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మరోవైపు రిచా ఘోష్ 6 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచింది. దీంతో భారత్ కేవలం 5 ఓవర్లలోనే 58 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. 90 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌లో భారత్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఇటీవల మహిళల ఆసియా కప్‌ను గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఇప్పుడు ఆసియా క్రీడల్లోనూ పతకంపై కన్నేసింది.
